Top Thief | జడ్జి సీట్లో దొంగ.. 2 నెలల తర్వాత తెలిసి అంతా షాక్

Top Thief | ఇండియన్ హిస్టరీలోనే అత్యంత తెలివైన దొంగ ధనీరాం మిట్టల్. ఈ మాట చెబుతోంది సాధారణ జనాలు కాదు.. ఏకంగా పోలీసులు, లాయర్లు

Spread the love
Top Thief

Top Thief | ఇండియన్ హిస్టరీలోనే అత్యంత తెలివైన దొంగ ధనీరాం మిట్టల్. ఈ మాట చెబుతోంది సాధారణ జనాలు కాదు.. ఏకంగా పోలీసులు, లాయర్లు, జడ్జిలు. ఇక అర్థం చేసుకోండి మనోడి తెలివి ఎలాంటిదో.

హర్యానా, పంజాబ్, చండీఘర్, రాజస్థాన్‌లతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 1000 కార్లను మిట్టల్‌ దొంగిలించాడని పోలీసుల మాట.

దాదాపు 130 కేసుల్లో అతడు దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించాడు. కార్లు దొంగిలించడం.. ఆ కార్లకు తనకొచ్చిన విద్యతో ఫోర్జరీ పేపర్లు రెడీ చేసి అమ్మేయడం.. ఇదే మిట్టల్ దందా.

1964లో ధనీరాంపై తొలిసారి దొంగతనం కేసు నమోదైంది. అక్కడి నుంచి 52 ఏళ్ల పాటు ధనీరాం దందా నడిచింది.

ఎన్నో కేసులు, శిక్షలు, రిలీజ్‌లు. ఎన్నిసార్లు జైలుకెళ్లినా.. మళ్లీ అదే తప్పు చేయడం, పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరు పెట్టడంతో జడ్జికి కూడా మిట్టల్ ముఖం చూస్తే విసుగొచ్చింది.

ఇలాగే ఓ సారి కోర్టులో జడ్జి.. ‘నువ్వా. నీ ముఖం చూడలేకపోతున్నా. పో.. పోయి బయట ఉండు పో’ అని చెప్పడంతో.. బయటకు వెళ్లిన మిట్టల్ జడ్జిగారు వెళ్లిపొమ్మన్నారని చెప్పి చల్లగా జారుకున్నాడు. తర్వాత జడ్జి పిలవడంతో పోలీసులకు అసలు విషయం అర్థమై తల పట్టుకున్నారు.

ఇదే కాదు.. 1968 నుంచి 74 మధ్య కాలంలో మిట్టల్ స్టేషన్ మాస్టర్‌గా కూడా పనిచేశాడు. అయితే పరీక్ష రాసి పాస్ అయి కాదు. ఫోర్జరీ సర్టిఫికేట్లతో. దాదాపు 4 ఏళ్ల పాటు అతడు ఈ ఉద్యోగంలో కొనసాగాడు.

ఆ తర్వాత అతడి గురించి తెలియడంతో పారిపోయాడు. అయితే కార్లు దొంగతనం, ఫోర్జరీలు చేయడంతోనే మిట్టల్.. దేశంలోనే పెద్ద దొంగ అయిపోలేదు. అతడి అసలైన ఆయుధం ఎల్ఎల్‌బీ.

ఎప్పుడూ కోర్టులో నిందితుడిగా జడ్జి ముందు నిలబడడమే అలవాటైన మిట్టల్‌కి కోర్టును కొత్తగా చూడాలనిపించింది. అది కూడా జడ్జి సీట్‌లో నుంచి చూడాలనిపించింది.

సాధారణంగా ఓ దొంగ జడ్జి సీటులో కూర్చోవడం ఎలా సాధ్యమవుతుంది..? అందుకే తన లాయర్ బుర్రకు ఫోర్జరీ తెలివి తేటలు వాడాడు. ఎల్ఎల్‌బీ చదివిన మిట్టల్‌కి కోర్టులో ఏం జరుగుతుందో మొత్తం తెలుసు.

అందుకే ఏకంగా పంజాబ్‌లోని జజ్జర్ కోర్టు మెజిస్ట్రేట్‌కు 2 నెలల సెలవులిస్తున్నట్లు ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి ఆయనని సెలవుపై పంపేశాడు. ఆ తర్వాత తానే ఆ జడ్జి సీట్‌లో కూర్చుని 2వేలకు పైగా తీర్పులిచ్చాడు.

ఈ తీర్పుల్లో ఎంతోమందికి బెయిల్ మంజూరు చేశాడు. కొంతమందికి శిక్షలు కూడా విధించాడు. 2 నెలలు ఇలా గడిచిన తర్వాత పాత జడ్జి తిరిగి రావడంతో మిట్టల్ గురించి తెలిసింది. కానీ పట్టుకుందామని పోలీసులు అనుకునే లోపే.. కనిపించకుండా మాయమైపోయాడు.

దీంతో చేసేదేం లేక మిట్టల్ ఇచ్చిన తీర్పులన్నింటినీ రద్దు చేశారు పాత జడ్జి. బహుశా ఓ జడ్జి పదవిని దొంగ ఆక్రమించడం ప్రపంచ న్యాయ చరిత్రలో, అందులోనూ ముఖ్యంగా భారత న్యాయవ్యవస్థ ఏర్పడిన తర్వాత అదే తొలిసారి కావచ్చు.

ధనీరాంని అతడితో పాటు జైల్లో ఉన్న ఖైదీలు.. దొంగతనాల్లో చార్లెస్ శోభ్‌రాజ్ అని పిలుచుకునేవారట. ఎంతోమంది దొంగలకు ధనీరాం ఓ రోల్ మోడల్. కానీ ధనీలాల్ ఎందుకిలా మారాడు..? అనే ప్రశ్నకు దొరికే ఒకే ఒక్క సమాధానం.. డిగ్రీ చదివిన తర్వాత ధనీరాం ఉద్యోగం కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాడు.

కానీ ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగంతో ఎన్నో అవస్థలు పడ్డాడు. అప్పుడే అతడికి దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే అతడిని పేరుమోసిన దొంగగా మార్చింది. ఆ తర్వాత ఎల్ఎల్‌బీ చదివాడు. ఇంకా ఎంతో నేర్చుకున్నాడు.

అయితే ధనీరాం ఏ దొంగతనం కూడా రాత్రిళ్లు చేయలేదు. అన్నీ పట్టపగలు చేశాడు. ఎవరినీ గాయపర్చకుండా సైలెంట్‌గా చేసేవాడు.

మిట్టల్ చివరిసారిగా 2016లో ఓ కారు దొంగతనం కేసులో అరెస్టై శిక్ష తర్వాత విడుదలయ్యాడు. ఆ తర్వాత 77 ఏళ్ల మిట్టల్ మళ్లీ కనిపించలేదు. మరి ఇప్పుడెక్కడున్నాడో..? ఏం చేస్తున్నాడో..?

#DhaniramMittal #India #TopThief

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *