
LIving Robots
Living Robots | రోబో అనగానే ఇనుప శరీరం. మేకులతో బిగించిన చేతులు, కాళ్లు, వైర్లు, బ్యాటరీలు.. ఇవే గుర్తొస్తాయి. కానీ ఎప్పుడైనా ప్రాణంతో ఉండే రోబోలను చూశారా..? వాటంతట అవి పునరుత్పత్తి చేసుకోగల రోబోలను చూశారా..? అయితే ఇప్పుడు చూడండి.
అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ రోబోలను తయారు చేశారు. ఓ మిల్లీమీటరు కంటే తక్కువ పొడవుండే ఈ రోబోలు వాటంతట అవి గుడ్రంగా తిరుగుతూ పునరుత్పత్తి చేసుకోగలవు. వీటికి గ్జీనోబాట్స్ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు.

గ్జీనోబాట్స్‌ను 2020లోనే అమెరికాలోని వెర్మాంట్ యూనివర్సిటీ, టఫ్స్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీలోని విజ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయాలాజికల్లీ ఇన్‌స్పైర్‌డ్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తలు తయారు చేశారు.
వీటిలో కదలికలు ఉండడం, బృందంగా పనిచేయడం, ఒకదాని గాయాలను మరొకటి చికిత్స చేసుకోవడం అన్నీ గమనించిన తర్వాత వీటి గురించి ప్రపంచానికి చెప్పారు.

గ్జీనోబాట్స్‌ను ఆఫ్రికన్ క్లాడ్ ఫ్రాగ్(Frog) కణజాలంతో తయారు చేశారు. ఈ కప్పను శాస్త్రీయంగా గ్జీనోపస్ లెవీస్ అని పిలుస్తారు. దీనిపై టఫ్స్ యూనివర్సిటీలోని ఎలెన్ డిస్కవరీ సెంటర్ డైరెక్టర్, బయాలజీ ప్రోఫెసర్ మైఖెల్ లెవీన్ వివరణ ఇచ్చారు.
కప్ప కణాల్లో స్వతహాగానే పునరుత్పత్తి సామర్థ్యం ఉంటుందని, అయితే వాటిని కప్ప నుంచి వేరు చేసి.. కొత్త వాతావరణంలో విడిగా విడిచిపెట్టినప్పుడే అసలు సవాల్ ఎదురవుతుందని అన్నారు.

ఆ కణాలు బయటి వాతావరణంలో బతకడం, మనుగడ సాగించడం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే తాము చేసిన ప్రయోగంలో ఆ కణాలు బతకడమే కాకుండా పునరుత్పత్తి శక్తిని కూడా సమకూర్చుకున్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ వెర్మాంట్‌కి చెందిన జాష్ బాంగార్డ్ దీనిపై స్పందించారు. ఈ రీసెర్చ్‌లో కీలక వ్యక్తి అయిన బాంగార్డ్ మాట్లాడుతూ.. రోబోట్లంటే ఇనుము, సెరామిక్‌లు మాత్రమే కాదని, జీవకణాలతో తయారు చేసినప్పటికీ, వాటి పనిచేసే విధానాన్ని బట్టి రోబోలుగానే పరిగణించాలని అన్నారు.
ఆ కోవలో ఇవి స్పష్టమైన రోబోలేనని చెప్పుకొచ్చారు.
#BiodegradableRobots #LivingRobots #Frog #HarwardUnivercity