Skeleton Lake | హిమాలయాల్లో కంకాళాల సరస్సు.. ఏంటీ మిస్టరీ?

Skeleton Lake

Skeleton Lake | హిమాలయాల్లో మనకు తెలియని వింతలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మనం ఇప్పటివరకు కనిపెట్టింది కొన్ని మాత్రమే. ఇంకా మనం కనిపెట్టాల్సినవి ఎన్నో ఉన్నాయి. అయితే కనిపెట్టిన వింతల్లో కూడా చాలా వరకు నేటికీ అంతుచిక్కని మిస్టరీలే. అలాంటి ఓ అంతుచిక్కిన మిస్టరీనే రూప్‌కుండ్ సరస్సు.
ఈ సరస్సు 5వేల అడుగుల ఎత్తులో త్రిశూల పర్వతం అంచున ఈ సరస్సు ఉంది. అయితే ఈ సరస్సులాంటి అనేక సరస్సులు ఈ హిమాలయాల్లో ఉన్నాయి.
కానీ వాటన్నింటిలో ఈ సరస్సుకే ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ సరస్సు అడుగున, చుట్టుపక్కల ఎక్కడ చూసినా మానవ అస్థిపంజరాలతో నిండి ఉంటుంది. ఇప్పటికీ 800 అస్థిపంజరాల వరకు సరస్సు సమీపంలో కనిపిస్తాయి.
నిజానికి ఈ సరస్సు సంవత్సరంలో ఎక్కువకాలం గడ్డకట్టిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఈ సరస్సు అడుగున ఏముందో కనిపించదు. కానీ అతి కొద్ది కాలం సరస్సు కరిగి నీరుగా ఉంటుంది. ఆ సమయంలో నీరు స్వచ్ఛంగా ఉండడం వల్ల అడుగున ఉన్న మానవ కంకాళాలు స్పష్టంగా కనిపిస్తాయి.

అయితే ఈ సరస్సులో ఉన్న కంకాళాలకు కారణాలు చెబుతూ ఇప్పటివరకు మూడు థియరీలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటంటే..
మొదటి థియరీ:
1942లో బ్రిటిషర్ల పాలనలో భారత్ ఉన్నప్పుడు ఓ ఫారెస్ట్ రేంజర్ ఈ ప్రాంతం నుంచి వెళుతున్నారట. వాళ్లే ఈ సరస్సును కనిపెట్టారు. ఇక్కడున్న అస్థిపంజరాలను కూడా చూశారు.
అయితే ఇవి ఎలా వచ్చాయి..? ఎక్కడి నుంచి వచ్చాయి. వాళ్లకు అంతుబట్టలేదు. దీంతో దీనిపై పరిశోధన చేశారు. అలా పరిశోధన చేసినప్పుడు వాళ్లు రకరకాల థియరీలు చెప్పారు.
1841లో టిబెట్ వైపు వెళుతున్న భారత సైనికులు ఈ ప్రాంతం గుండా వెళ్లారు. ఆ సమయంలోనే ఏదో ప్రమాదం జరిగి ఆ సైనికులంతా ఇక్కడే చినిపోయారు. వాళ్ల కంకాళాలే ఇవి.
అయితే ఇక్కడ లభించిన కంకాళాల్లో చాలా కంకాళాలు పిల్లలవి, మహిళలవి కూడా ఉన్నాయి. అలాగే ఈ కంకాళాల వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. దీంతో ఈ థియరీ తప్పని తేలింది.
రెండో థియరీ:
ఈ సరస్సుకు సమీపంలోని గ్రామాల్లో ఒకప్పుడు ఏదో పెద్ద మహమ్మారి రోగం వ్యాపించిందని, దాంతో ఆ మాయరోగం వల్ల మరణించిన వారిని గ్రామస్థులు ఈ సరస్సులో వేసి ఉంటారు. కానీ ఈ అస్థిపంజరాలను పరిశీలిస్తే.. వాళ్లు చనిపోయినప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తేలింది.
అలాగే ఈ కంకాళాల్లో చాలావరకు పుర్రెలు పగిలి ఉన్నాయి. దీంతో వీళ్లంతా ఏదో పెద్ద భారీ వస్తువు తలపై పడడం వల్ల చనిపోయి ఉంటారని, మహమ్మారి రోగం వల్ల కాదని నిర్ణయానికొచ్చారు. దీంతో ఈ థియరీ కూడా తప్పని తేలింది.
మూడో థియరీ:
ఈ సరస్సు ఉన్న ప్రాంతంలో ఉన్న నందాదేవీ ఆలయానికి స్థానిక రాజు తన కుటుంబం, ప్రజలతో కలిసి బయలుదేరగా.. మార్గం మధ్యలో ఈ సరస్సు దగ్గరకు రాగానే అనుకోని విధంగా మంచుకొడలు విరిగిపడ్డాయని, ఆ ప్రమాదంలోనే వీళ్లంతా మరణించారని అంచనా వేశారు.
ఉత్తరాఖండ్ గిరిజన ప్రాంతాల్లో ఈ విషయంపై ఓ జానపద గీతం కూడా ఉంది. నందాదేవికి ఓ సారి కోపం రావడంతో పెద్ద పెద్ద బండరాళ్లను కురిపించిందనేది ఆ పాట సారాంశం. చాలా కాలం వరకు ఇదే సరైన థియరీ అని అంతా అనుకున్నారు. అయితే 2019లో ఈ థియరీపై ఓ ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తింది.
2019లో బయటపడ్డ షాకింగ్ విషయం:
అయితే ఈ మూడు థియరీలనూ ఇండియా, అమెరికా, జర్మనీకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు నమ్మేలేదు. దీంతో16 ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన 28 మంది ఇక్కడ 5ఏళ్ల పాటు పరిశోధనలు చేశారు. వాళ్లు ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.
అదేంటంటే.. ఈ అస్థిపంజరాలన్నీ ఒకే కాలానికి, ఒకే వర్గానికి చెందిన కంకాళాలు కావు. ఈ కంకాళాల్లో కొన్ని 1000 ఏళ్ల నాటివి కాగా.. కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం నాటివి.
ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ అస్థిపంజరాల్లో కొన్ని దక్షిణ భారతదేశానికి చెందినవి, మరికొన్ని ఏకంగా గ్రీకు దేశానికి చెందినవని తేల్చారు. దీంతో మొదటి మూడు థియరీలు తప్పని తేలిపోయింది. అలాగే ఈ సరస్సు రహస్యం మరింత మిస్టరీగా మారింది.
ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు కూడా ఈ సరస్సులోని కంకాళాల వెనకున్న రహస్యం ఏంటో అర్థం కాలేదు. పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి అసలు నిజం ఎప్పటికి తెలుస్తుందో ఏమో.
#RoopKund #Himalayas #TrisulParvat #Skeleton