Money on Road | నోట్ల వర్షం.. కార్లన్నీ ఆపేసి ఎలా ఏరుకుంటున్నారో చూడండి


Money on Road | ఎప్పటిలానే రోడ్డుపై అలా కార్లో వెళ్తున్నారనుకోండి. ఉన్నట్లుండి కరెన్సీ నోట్లు గాల్లో ఎగురుతూ రోడ్డంతా నిండిపోతే.. మీరేం చేస్తారు? మీరేమో కానీ అమెరికా జనాలు మాత్రం కార్లు నడిరోడ్డుపై వదిలేసి నోట్ల కోసం పరిగెత్తారు. కుప్పలు కుప్పలు ఏరుకుని ఆనందంతో గెంతులేశారు. అమెరికాలోని శాండియాగో ఫ్రీ వే పై రెండు రోజుల క్రితం కనిపించిన దృశ్యాలివి.
భారీ స్థాయిలో కరెన్సీ తీసుకెళుతున్న ఓ ట్రక్కు నుంచి ఈ నోట్లు అనుకోకుండా ఇలా బయటపడ్డాయి. దీంతో అటుగా వెళుతున్న జనాలు.. కార్లను రోడ్డుకు అడ్డంగా వదిలేసి కరెన్సీ కోసం ఎగబడ్డారు. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొందరు ఈ తంతునంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. నోట్లు ఏరుకుంటూ, సంతోషంతో చిందులేస్తూ వీడియోలు తీసుకున్నారు.
అయితే ఇది ప్రభుత్వ సొమ్ము అని, దీనిని తీసుకోవడం నేరమని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే ఈ వీడియోల సాయంతో ఓ ఇద్దరిని అరెస్టు కూడా చేసినట్లు చెప్పారు. మిగతా వారు కూడా డబ్బును తిరిగిచ్చేయాలని అధికారులు కోరారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది హెచ్చరించారు.