
Job

Job | కోవిడ్ డెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. జాబ్స్ పోవడంతో అనేకమంది రోడ్డున పడ్డారు. అలా రోడ్డున పడిన ఓ నిరుద్యోగి చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అంతేకాదు.. అతడి ఐడియాతో మూడంటే మూడు గంటల్లో ఉద్యోగం కూడా పట్టేశాడు. ప్రస్తుతం అతడి స్టోరీ విపరీతంగా వైరల్ అవుతోంది.
హైదర్ మాలిక్.. 24 ఏళ్ల ఈ కుర్రోడు లండన్‌లో నివశిస్తున్నాడు. కోవిడ్ దెబ్బకు కొన్ని నెలల క్రితం జాబ్ కోల్పోయాడు. ఆ తర్వాత ఎన్నోసార్లు ఎన్నో కంపెనీలకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ ప్రయోజనం లేదు.
ఇక ఉద్యోగం కోసం ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు. ఫ్యూచర్ అంతా చీకటిగా కనిపించింది. ఆ టైంలో అతడికి ఉన్నట్లుండి ఓ ఐడియా వచ్చింది.
వెంటనే దగ్గరలోని స్టేషనరీ దుకాణం నుంచి బోర్డ్ కొన్నాడు. దానిపై తన సీవీ(C.V)కి సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను ఉంచాడు.
అలాగే తాను బీఎస్సీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ చదివానని, గ్రాడ్యుయేషన్‌లో ఫస్ట్ క్లాస్ సాధించానని రాసుకొచ్చాడు.
ఏదైనా ప్రాథమిక స్థాయి(Entry level) ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నానని అందులో పేర్కొన్నాడు.
అనేక చోట్ల ఇలాంటి ప్లకార్డులను ఉంచాడు. ప్లకార్డులు పెట్టిన 3 గంటల్లోనే అతడి ప్రయోగం ఫలించింది. మంచి ఉద్యోగం లభించింది.
అయితే తన ఐడియాకు కారణం తన తండ్రేనని చెబుతాడు మాలిక్. తన తండ్రి పాకిస్తాన్ నుంచి బ్రిటన్ వచ్చినప్పుడు కూడా ఉద్యోగం కోసం ఇలా వెతుక్కోవాలని ఆయన అప్పట్లో అనుకున్నారట.
అదే ఐడియా ఇప్పుడు తనకు ఉపయోగపడిందంటాడు మాలిక్. తనకు ఉద్యోగం ఎలా లభించిందో కూడా మాలిక్ వివరించాడు.
‘ఉదయం 7 గంటలకు మెట్రో స్టేషన్లో బోర్డ్ పెట్టుకుని నిలబడ్డాను. కొంతమంది నన్ను చూసి నవ్వుకుంటూ వెళుతున్నారు. మరికొంతమంది తమ మొబైల్ నెంబర్లు ఇచ్చి వెళుతున్నారు.
అదే సమయంలో ఇమ్మాన్యుయేల్ అనే వ్యక్తి నన్ను చూసి.. నా రెజ్యూమ్‌ను లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశాడు.
అంతే 9:30 గంటలకి కానరీ వార్ఫ్ గ్రూప్‌లో ట్రెజరీ అనలిస్ట్‌గా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి పిలుస్తున్నట్లు నాకు సందేశం వచ్చింది. నేను సమయానికి అక్కడికి చేరుకున్నాను. ఇంటర్వ్యూ సక్సెస్ అవడంతో ఉద్యోగం దొరికింది.” అని మాలిక్ చెప్పుకొచ్చాడు.
ఏది ఏమైనా అతడి ఐడియాతో కేవలం 3 గంటలు కూడా గడవకముందే ఉద్యోగం సంపాదించిన మాలిక్‌ను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే.