Viral News | సమాధానం మీది ఫ్రీ రైడ్ నాది.. కేబీసీ ఆడుతున్న ఆటోడ్రైవర్!


Viral News | మీలో ఎవరు కోటీశ్వరుడు, కౌన్ బనేగా కరోడ్ పతి.. ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసే ఉంటారుగా.. 15 ప్రశ్నలు చెబితే కోట్ల రూపాయలు గెలుచుకోవచ్చు. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాడు బెంగాల్ లోని ఓ ఆటో డ్రైవర్. తన ఆటో ఎక్కే ప్రతి పాసెంజర్ ని అతడు 15 ప్రశ్నలు అడుగుతాడు. వాటికి సరిగ్గా ఆన్సర్ చెబితే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా తీసుకెళ్తాడు.
ఒకవేళ ఏదైనా తప్పుగా చెబితే మాత్రం రైడ్ కి సరిపడా డబ్బులు ఇవ్వాల్సిందే. ఇప్పటివరకు అతడి క్విజ్ లో చాలామంది ఫెయిల్ అయ్యారు. పాస్ అయిన వాళ్ళని మాత్రం అన్నట్లుగానే ఫ్రీగా తీసుకెళ్లి వదిలిపెడతాడు. అసలు ఎవరా ఆటో డ్రైవర్..? ఏంటి కథ..? ఇప్పుడు తెలుకుందాం.
‘మహిళలకు, వికలాంగులకు ఫ్రీ’ ఈ మాట చాలా ఆటోలపై రాసి ఉండడం చూసే ఉంటారు. కానీ బెంగాల్‌లోని ఓ ఈ-రిక్షా డ్రైవర్ మాత్రం వెరైటీగా ఆలోచించాడు. అతడి పేరు సురాంజన్ కర్మాకర్. హౌరా జిల్లాలో ఈ-రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ‘మహిళలకు, వికలాంగులకే ఎందుకు..? సాధారణ ప్రజలకు కూడా ఫ్రీ రైడ్స్ ఇద్దాం. కానీ వాళ్ళకి కొంచెం జ్ఞానం కూడా పంచుదాం’ అనుకున్నాడు.
తాను అడిగే జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు సమాధానం చెబితే.. వారిని ఫ్రీగా తీసుకెళతాడు. అయితే తన రిక్షా ఎక్కే ప్రతి ఒక్కరికీ అతడో ఆఫర్ ఇస్తాడు. తాను అడిగే 15 ప్రశ్నలకు సమాధానం ఇస్తే.. ఒక్క రూపాయి కూడా తీసుకోనని సవాల్ విసురుతాడు. ఒకవేళ ఎవరైనా సమాధానాలన్నీ కరెక్ట్‌గా చెబితే అన్నట్లుగానే ఫ్రీగా వదిలిపెడతాడు. సురాంజన్ 6వ తరగతిలోనే స్కూలుకు వెళ్లడం మానేశాడు. అయినా చదువుపై ఆసక్తితో ప్రతి రోజూ రాత్రి 2 గంటల వరకు చదువుతాడు.
ఆ చదువును పదిమందికి పంచాలనేదే అతడి ఆలోచన. దీని గురించి సంకలన్ సర్కార్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో.. కర్మాకర్ గురించి ప్రపంచానికి తెలుస్తోంది. అంతా అతడి కాన్సెప్ట్ ని తెగ మెచ్చుకుంటున్నారు.