Village for Women | మహిళలకు మాత్రమే.. ప్రపంచంలో ఇదొక్కటే

Village for Women

Village for Women | ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా.. మహిళలు మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
చిన్నప్పుడే పెళ్లి, ఆ తర్వాత అత్తింట్లో భర్త అడుగుజాడల్లో నడవడం. ఒకవేళ భర్త దుర్మార్గుడైతే.. అతడు పెట్టే హింసలను మౌనంగా భరించడం.. ఇదేనా మహిళల జీవితం..?
కాదు.. కానేకాదు. ఈ మాటను నిరూపించింది ఓ మహిళ. తన భర్త పెట్టే హింస తట్టుకోలేక.. తనలాంటి మరికొంతమంది మహిళలతో కలిసి ఏకంగా ఓ ఊరినే సృష్టించుకుంది.
తమను అణగదొక్కాలని ప్రయత్నించిన పురుషులతో ధీటుగా పోరాడింది. ఆ ఊరు కేవలం మహిళల కోసం మాత్రమే. పురుషులకు ప్రవేశం లేదు. ఎవరామె? ఎక్కడుందా ఊరు?
‘నువ్వు ఆడదానివి ఏం చేస్తావ్..?’ ఈ ప్రశ్న చాలా చోట్ల వింటూ ఉంటాం. సమాజంలో స్త్రీలు ఎంత గొప్పగా రాణిస్తున్నా.. ఇప్పటికీ ఈ ప్రశ్న వాళ్లకు ఎదురవుతూనే ఉంది.
అయితే ఈ ప్రశ్న ఎదురైన ప్రతిసారీ స్త్రీలు తమ గొప్పతనాన్ని చాటిచెబుతూనే ఉన్నారు.
ఆమె కూడా అంతే. ప్రపంచానికి తానేం చేయగలనో చూపించింది. ఇంతవరకు ఏ స్త్రీ సాధించిన ఓ అసాధ్యాన్ని సాధ్యం చేసింది.
ఎవరామె..?

ఆమె పేరు రెబేకా లోలోసోలి. ఆఫ్రికాలోని కెన్యాకు చెందిన మహిళ. 30 ఏళ్ల క్రితం రెబేకాకు పెళ్లయింది. అయితే ఆమె భర్త దుర్మార్గుడు. ప్రతి రోజూ ఆమెను తీవ్రంగా కొడుతూ హింసించేవాడు. ఆ బాధలు తట్టుకోలేకపోయేది.
అప్పుడే ఆమెకు తాను మాత్రమే కాదు. తన చుట్టూ ఉండే ప్రతి మహిళా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారని అర్థమైంది.
బాల్య వివాహాలు, గృహ హింసలకు ప్రతి అమ్మాయి బలవుతోందని గమనించింది రెబెకా. తమకు సాయం చేయాని అధికారులకు అర్జీలు కూడా పెట్టుకుంది.
కానీ ఫలితం లేదు. అప్పుడే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. అసలు మగవారే లేకపోతే తమకు ఈ సమస్య ఉండదు కదా.. అని అనుకుంది. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ‘ఉమోజా’. ఉమెజా అంటే ఐకమత్యం. కలిసి ఒక్కటిగా ఉండడం.
అందరూ కలిసి ఒక్కటిగా..:

తనలా కష్టాలు పడుతున్న మహిళలతో కలిసి రెబేకా నిర్మించిన గ్రామం పేరిది. సొంతంగా ఉమోజా గ్రామాన్ని నిర్మించుకుంది. ఆ గ్రామంలో మహిళలు మాత్రమే ఉంటారు. వాళ్లంతా తమకు నచ్చినట్లు ఉండొచ్చు. ఈ ఊళ్లో ఓ స్కూల్ కూడా ఉంది. అక్కడ ఆడపిల్లలకు అవసరమైన విద్యాబుద్ధులు నేర్పుతారు.
ఆడవారు, ముఖ్యంగా యువతులు.. వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేయడమే తన లక్ష్యమని చెబుతారు రెబేకా. ప్రపంచంలోని ప్రతి స్త్రీకి తన ఉమోజా గ్రామం ఓ ఆదర్శం అంటారామె.
ఈ గ్రామంలో మహిళలకు ఒకవేళ మగ పిల్లలు పుడితే.. 18 సంవత్సరాలు వచ్చే వరకు వారు గ్రామంలో ఉండవచ్చు. అది కూడా మహిళల గొప్పతనాన్ని, వారి నాయకత్వాన్ని అంగీకరిస్తేనే.
ఒకవేళ ఎవరైనా దానిని వ్యతిరేకిస్తే వారిని గ్రామం నుంచి పంపించి వేస్తారు.
అణచివేసేందకు ప్రయత్నం:

అయితే ఆమెకే కాదు, ఆమె సృష్టించిన గ్రామానికి కూడా ఎన్నో సమస్యలు సృష్టించారు అక్కడి పురుషులు. ఆమె గ్రామానికి టూరిస్టులు రాకుండా, ఎలాంటి ఆదాయం లేకుండా అడ్డుకుంటూ చుట్టుపక్కల ఇంకో గ్రామాన్ని సృష్టించారు.
కానీ ఉమోజా మహిళలు భయపడలేదు. వెనక్కి తగ్గలేదు. రూపాయి రూపాయి కూడబెట్టి పురుషుల గ్రామాన్ని కొనేశారు. అలా తమ ఆశయం ఎంత గొప్పదో నిరూపించారు.
ప్రపంచ దేశాలు కూడా వారిని గుర్తించాయి. ఆ గ్రామానికి ఓ ప్రత్యేక గుర్తింపునిచ్చాయి.
ఈ ఉమోజా గ్రామాన్ని మహిళా సాధికారతకు నిదర్శనంగా చెబుతారు అనేకమంది. మహిళలను అణచివేసే విధానాలను పక్కనపెట్టి, వారికి సరైన అవకాశాలను కల్పిస్తే ఈ సమాజంలో ఎంతో సాధిస్తారని రెబేకా నిరూపించారని చెబుతారు.
ఏది ఏమైనా రెబేకా ధైర్యానికి, ఆత్మస్థైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.