
Smallest Camera

Smallest Camera | మీరు పై ఫోటోలో చూస్తోంది ఓ కెమెరా. అది కెమెరా అని మీకు అనిపించినా, అనిపించకపోయినా మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే అది నిజంగా కెమెరానే. ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న కెమెరాలన్నింటిలోకీ ఇదే అత్యంత చిన్న కెమెరా.
ఇంకా సరిగ్గా చెప్పాలంటే.. సూది మొన అంత కెమెరా అన్నమాట. అయితే చిన్నదిగా ఉంది కదా అని ఇదేదో బొమ్మ కెమెరా అనుకునేరు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.
ఈ కెమెరా తనకన్నా 5 లక్షల రెట్లు పెద్దవైన వస్తువులను కూడా సులభంగా ఫొటోలు తీసేస్తోందట. ఈ విషయాన్ని పరిశోధకులు అధికారికంగా ప్రకటించారు.
ఈ బుల్లి కెమెరాను ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకులు కలిసి రూపొందించారు. ‘మెటాసర్‌ఫేస్’ టెక్నాలజీతో దీనిని తయారు చేసినట్లు వారు తెలిపారు.

సుమారు 16 లక్షల సిలిండ్రికల్ పోస్టులను ఒకటిగా కూర్చి ఈ కెమెరాను తయారు చేసినట్లు వెల్లడించారు.
అయితే ఇంతకుముందు కూడా ఎన్నో మెటా సర్‌ఫేస్ కెమెరాలను శాస్త్రవేత్తలు తయారు చేసినా.. ఈ కెమెరాతో పోల్చితే వాటితో తీసిన ఫొటోలు అంత స్పష్టంగా రాలేదు.
వస్తువుల అంచులు కొంచెం మసకగా కనిపించడం తప్ప.. పెద్ద పెద్ద కెమెరాలతో పోటీ పడుతూ ఈ మెటా సర్‌ఫేస్ కెమేరా ఫోటోలు తీస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ కెమెరాను ముఖ్యంగా వైద్య రంగంలో ఉపయోగించే ఉద్దేశంతో తయారు చేసినట్లు పరిశోధకులు చెప్పారు. దీని సాయంతో వైద్యరంగంలో దానివల్ల వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చని బలంగా చెబుతున్నారు.
భవిష్యత్తులో ఈ కెమెరాలను భారీగా ఉత్పత్తి చేయొచ్చని, దానివల్ల సాంకేతికంగా చాలా అభివృద్ధి సాధించగలుగుతామని పరిశోధకులు తెలియజేశారు.