School Student | అరేయ్ హన్మంతు.. పెన్సిల్ తీసుకున్నాడని పోలీస్ స్టేషన్‌కి వేళ్తావా..?

School Student

School Student: మీలో ఎంతమందికి గుర్తుందో కానీ.. చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా పెన్సిళ్లు, పెన్నులు మనవి తీసుకుంటే.. ‘టీచర్ వీడు నా పెన్సిల్ కొట్టేశాడు’ అని కంప్లైంట్ ఇచ్చేవాళ్లం. అప్పుడు టీచర్ వాడిని పిలిచి మందలించి మన పెన్సిల్, పెన్ను ఏదైతే అది ఇప్పించేవాళ్లు. కానీ ఇప్పుడు చెప్పబోయే బుడ్డోడు మాత్రం మామూలోడు కాదు.. తన పెన్సిల్ కొట్టేసిన ఫ్రెండ్‌ని ఏకంగా స్టేషన్‌కి తీసుకెళ్లాడు.
అక్కడ ‘సార్ వీడు రోజూ నా పెన్సిల్, పెన్నులు తీసుకుంటున్నాడు. వీడిపై కేసు పెట్టండి’ అని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. ఈ బుడ్డోడి మాటలు విన్న పోలీసులకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. కాసేపటికి తేరుకుని అంతా నవ్వుకున్నారు.
కర్నూలు జిల్లాలో హన్మంతు అనే బుడ్డోడు మంగళవారం పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాడు. స్కూల్ యూనిఫాంలో వచ్చిన ఆ చిన్నారిని చూసిన పోలీసులు ఏంటని అడిగారు. అతడితో పాటు వచ్చిన మరో చిన్నారిని చూపించిన హన్మంతు.. ‘సార్ వీడు నా పెన్సిల్, పుస్తకాలు తీసుకుంటున్నాడు.. రోజు ఇలానే చేస్తున్నాడు. వీడి మీద కేసు పెట్టండి’ అని కంప్లైంట్ ఇచ్చాడు.
ఇది విన్న పోలీసులు నవ్వుకుని.. వారికి సర్ది చెప్పారు. అలాగే కేసు పెట్టడం మంచి పద్దతి కాదని, ఇద్దరూ స్నేహంగా ఉండాలని సూచించి, ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇప్పించి పంపించారు. అలాగే వేరే వాళ్ల పెన్సిళ్లు, పుస్తకాలు తీసుకోకూడదని రెండో విద్యార్థికి కూడా చెప్పి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి పంపారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.