

RRR | జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే దర్శకుడు రాజమౌళి ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూలో ఆర్.ఆర్.ఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, ఆలియా భట్, మిగతా నటీనటులు ఒక్కొక్కరు ఎంతలా కష్టపడ్డారో వివరించారు రాజమౌళి. ముఖ్యంగా గోండు వీరుడు కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్‌ని అడవిలో చెప్పులు లేకుండా పరిగెత్తించానని చెప్పారు.
‘బల్గేరియాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడి అడవుల్లో ఎన్టీఆర్ పరిగెత్తాల్సిన సీన్ ఉంది. దానికోసం చెప్పులు కూడా లేకుండా పరిగెత్తాలని ఎన్టీఆర్‌కు చెప్పాను. అతడు ఏమీ మాట్లాడకుండా చెప్పినట్లే చెప్పులు లేకుండా పరిగెత్తాడు. అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలూ కాలేదు’ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే, ఈ చిత్రం 2022 జనవరి 7వ తేదీన విడుదల కానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఓమిక్రాన్ నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడే అవకాశాలు లేకపోలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.