
Yogi Adityanath

Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ పప్పులో కాలేసింది. మొన్నామధ్య బెంగాల్‌లోని ఫ్లై ఓవర్‌ని ఉత్తరప్రదేశ్‌లో ఉందంటూ చూపించి నవ్వులపాలైంది యూపీ ప్రభుత్వం. యూపీలో జరిగిన అభివృద్ధి అని చూపిస్తూ.. కోల్‌కతాలోని ఓ ఫ్లైఓవర్ ఫోటోను పాంప్లేట్లపై ముద్రించింది. దీనిపై అప్పట్లో తీవ్రదుమారం రేగింది. ప్రతిపక్షాలన్నీ యూపీ సర్కార్‌పై విరుచుకుపడ్డాయి. పక్క రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిని ఇలా ఎలా వాడుకుంటారంటూ అనేకమంది ట్రోల్ చేయగా.. కొంతమందైతే యోగీ ప్రభుత్వం ప్రజల్లో సృష్టిస్తున్న భ్రమలకు ఇది నిదర్శనమని విమర్శలు గుప్పించారు.
అయితే ఆ వివాదం సర్దుమణిగిందో లేదో.. ఇప్పుడు అంతకంటే దారుణమైన మరో తప్పు చేసింది యోగి సర్కార్. రెండు రోజులుగా యూపీ అధికారులు యూపీలోని అత్యాధునిక ఎయిర్‌పోర్ట్‌గా నోయిడా ఎయిర్‌పోర్ట్‌కు రికార్డ్ దక్కిందంటూ వరుస ట్వీట్లు చేయసాగారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వాళ్లు చేసిన ట్వీట్లలో నోయిడా ఎయిర్‌పోర్ట్ కాకుండా.. ఏకంగా పక్క దేశంలోని ఎయిర్‌పోర్ట్ ఫోటోను వినియోగించారు.
అది కూడా చైనా రాజధాని బీజింగ్‌లోని డాక్సిన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఫోటోను వారంతా షేర్ చేశారు. ఈ విమానాశ్రయం నోయిడాలోని విమానాశ్రయంగా చెబుతూ వాళ్లంతా ట్విట్లలో రాసుకొచ్చారు. ఈ ట్వీట్లపై ఇప్పుడు విపరీతంగా ట్రోల్స్, మీమ్స్ చేస్తూ నెటిజన్లు రెచ్చిపోతున్నారు.

అలాగే రెండు, మూడు రోజుల క్రితం నోయిడా ఎయిర్‌పోర్ట్ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ అయిన అక్కడి విమానాశ్రయం వీడియోను కూడా షేర్ చేసి యోగీ సర్కార్‌ను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ సారి చైనా అధికారులు కూడా ఇందులో తమ పాత్ర పోషించారు. ఈ ఫోటో తమ విమానాశ్రయానిదని, ఇది నోయిడా విమానాశ్రయం కాదంటూ ట్వీట్లు చేస్తున్నారు. యూపీ ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నారు. ఏది ఏమైనా యూపీ సర్కార్ మరోసారి బ్లండర్ మిస్టేక్ చేసి తప్పులో కాలేసింది.