Man Saves Life | శభాష్..! కారును త్యాగం చేశాడు.. ప్రాణం కాపాడాడు


Man Saves Life | రోడ్డుపై వెళుతున్న ఓ కారును వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో కారు బలంగా ఢీ కొట్టింది. ముందు కారులో ఉన్న వ్యక్తి గబగబా కారు ఆపి బయటకు వచ్చి వెనుక కారులోని మహిళను కాపాడాడు. అదేంటి..? యాక్సిడెంట్ చేసింది ఆమె, అతడి కారును భారీగా డ్యామేజ్ చేసింది ఆమె.
అయినా అతడు ఆమెను కాపాడడం ఏంటి..? అని ఆలోచిస్తున్నారా..? నిజానికి అది యాక్సిడెంట్ కాదు. ముందు ఉన్న కారు వ్యక్తి కావాలనే తన కారును ఆ కారుకు అడ్డంగా నిలిపాడు. వెనుకగా వస్తున్న కారులోని మహిళ.. కారు నడుపుతూనే స్పృహ కోల్పోవడంతో అదుపుతప్పింది. కారు ఎటు పడితే అటు, ఎలా పడితే అలా వెళుతోంది.
అటుగా వస్తున్నహెన్రీ టెమెర్‌మన్స్ అనే వ్యక్తి ఇది గమనించాడు. ఆమెను కాపాడాలనుకున్నాడు. వెంటనే తన కారును వేగంగా ముందుకు పోనిచ్చి ఆమె కారుకు అడ్డంగా పెట్టాడు. వేగంగా వస్తున్న కారు బలంగా గుద్దింది. హెన్రీ కారు బాగా డ్యామేజ్ అయింది. కానీ ఇదేమీ పట్టించుకోకుండా అతడు ఆమెను రక్షించాడు.

ఈ దృశ్యాలన్నీ వెనుకగా వస్తున్న మరో కారు డ్యాష్ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ కారు యజమాని ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఈ ఘటన నెదర్లాండ్స్‌లోని నన్స్‌పీట్‌లోని A28 రోడ్లో జరిగింది. దీనిపై హెన్రీ మాట్లాడుతూ.. తన కారు బాగా దెబ్బతిన్నా.. ఓ వ్యక్తిని కాపాడడడమే ఆనందంగా ఉందంటున్నాడు. హెన్రీ గొప్పతనాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ‘రియల్ హీరో’ అంటూ ప్రశంసిస్తున్నారు.