Pod Hotel | ఐఆర్‌సీటీసీ సరికొత్త కాన్సెప్ట్.. ఇక హోటల్స్ అవసరమే లేదు


Pod Hotel: పాశ్చాత్య ప్రపంచంలో ‘పాడ్ హోటల్’గా పిలుచుకుంటున్న ఈ బుల్లి గదుల హోటల్స్.. ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాపిస్తున్నాయి. జపాన్‌లో 1979 నుంచే అందుబాటులోకి వచ్చిన ‘క్యాప్స్యూల్ హోటల్’ కాన్సెప్ట్ ఇప్పుడు ముంబైకి వచ్చింది.
భారతీయ రైల్వే సంస్థ.. ఐఆర్‌సీటీసీ ఈ పాడ్ హోటల్స్‌ను తీసుకొచ్చింది. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పాడ్ హోటల్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ హోటల్లో మొత్తం 48 చిన్న బెడ్ సైజ్ క్యాప్సూల్స్ ఉన్నాయి.
దీనిపై ఇండియన్ రైల్వేస్‌లో మొదటిదని ఇండియన్ రైల్వే అధికారులు మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో క్యాప్స్యూల్ హోటల్స్’కు డిమాండ్ బాగా పెరిగిందని, భారత్‌లో మొదటి ‘పాడ్ హోటల్’ ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని అన్నారు. విమాన, బస్సు ప్రయాణ ఖర్చులతో పోలిస్తే ‘రైలు’ ప్రయాణం తక్కువ ఖర్చు అవుతుంది.
అందుకే అనేకమంది ప్రయాణికులు రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. ఇదే ఆలోచనను దృష్టిలో ఉంచుకున్న ఐఆర్‌సీటీసీ.. ప్రయాణికులకు ప్రయాణంలోనే కాకుండా, బస చేసేందుకు కూడా చౌకైన విడిది సౌకర్యాలను కల్పించాలని అనుకుంది. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ ‘క్యాప్స్యూల్ హోటల్’ ఐడియా. సాంప్రదాయ హోటళ్లు అందించే విశాలమైన, ఖరీదైన గదులు అవసరంలేని లేదా ఆ ఖర్చును భరించలేని అతిథుల కోసం ఈ ‘పాడ్ హోటల్స్’ బాగా ఉపయోగపడతాయని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది.
ఈ పాడ్ హోటల్స్‌లో క్లాసిక్, ప్రైవేట్ పాడ్స్‌తో పాటు మహిళలు, వికలాంగుల కోసం ప్రత్యేక పాడ్స్ ఉన్నాయి. ప్రతీ పాడ్ రూమ్ ఉచిత Wi-Fi, టాయిలెట్ సౌకర్యంతో పాటు సామాన్లు భద్రపరిచే స్థలాన్ని అందిస్తుంది. ఇక పాడ్ లోపల టీవీ, చిన్న లాకర్, అద్దం, ఏసీ, ఎయిర్ ఫిల్టర్ వెంట్స్, రీడింగ్ లైట్స్ వంటి ఫెసిలిటీస్ కూడా పొందవచ్చు.
అంతేకాదు ఇంటీరియర్ లైటింగ్, మొబైల్ చార్జింగ్ సాకెట్స్, స్మోక్ డిటెక్టర్స్ సహా ‘డోంట్ డిస్టర్బ్’ సూచికలు కూడా అమర్చారు. ఒక వ్యక్తికి 12 గంటలకు గాను రూ.999 నుంచి చార్జీలు మొదలవుతుండగా, 24 గంటలకు రూ.1,999 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అవసరాలను బట్టి టారిఫ్స్ మారవచ్చని ఐఆర్‌సీటీసీ తెలిపింది.