

Shocking | అనారోగ్యంతో ఉన్న మేక పిల్లని చంపబోతుంటే కాపాడినందుకు తనని అరెస్ట్ చేశారంటూ ఓ యానిమాల్ రెస్కుయర్ వెల్లడించారు. ఓ చిన్న మేక పిల్లని చంపడానికి ప్రయత్నిస్తే తాను కాపాడి ఆస్పత్రిలో చేర్పించానని, కానీ పోలీసులు తనపై కక్షతో అరెస్ట్ చేశారని అతడు ఆరోపించాడు. ఈ ఘటన తనేలోని శ్రీనగర్ లో జరిగింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం, స్థానిక వ్యక్తి పెంచుకుంటున్న ఓ మేకను సురేష్ థాపా అనే వ్యక్తి దొంగతనం చేశాడని, అందుకే అతడిని అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
అయితే వి ఫర్ ఏ కాజ్ ఫౌండేషన్(we for a cause foundation) సభ్యుడు కపడి చెబుతున్న దాని ప్రకారం.. అతడికి డిసెంబర్ 25న తన స్నేహితురాలి నుంచి కాల్ వచ్చింది. ఇద్దరు వ్యక్తులు ఓ చిన్న మేకను చంపబోతున్నారని ఆమె తెలిపింది. వెంటనే అక్కడికెళ్లిన కపిడి, సురేష్ లు ఆ మేకను కాపాడారు. అది అనారోగ్యంతో ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించారు. బహిరంగ ప్రదేశాల్లో చంపకూడదని చెప్పినా.. అతడు వినలేదని అందుకే మేకను తీసుకెళ్లామని కపిడి చెప్పారు. మేకను కాపాడిన మొత్తం దృశ్యాలు ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ స్ట్రీమ్ చేశామని, ఆసుపత్రి రిపోర్ట్ లు ఉన్నాయని, అయినా తమపై పోలీసులు కావాలనే ఇలా కేసు పెట్టారని ఆరోపించారు. ఇంతకు ముందు ఇలాగే ఓ జంతువు చనిపోయిన కేసులో పోలీసులను నిలదీసామని, అది మనసులో పెట్టుకునే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.