Love Hotels | వామ్మో ఏం డిమాండ్.. ఇప్పుడిదే హాట్ గురూ..!

Love Hotels

Love Hotels | లవ్ హోటల్స్.. ఇప్పుడు దేశంలో ఈ హోటల్స్‌కు బాగా డిమాండ్ ఉంది. యువతీయువకుల కోసం ఏర్పాటు చేసిన ఈ హోటల్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. పేరుకు తగ్గట్లే ఈ హోటల్స్‌ని జంటల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ఓ అమ్మాయి-అబ్బాయి చేతులు పట్టుకుని నడిస్తేనే తప్పుగా అనుకునే ప్రస్తుత సమాజంలో ఇలాంటి ఓ కాన్సెప్ట్ తీసుకురావడం సాధారణ విషయమైతే కాదు.
దీనిని నడపాలంటే ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాలి. ఎన్నో సమస్యలను అధిగమించాలి. ముఖ్యంగా సంస్కృతి, సంప్రదాయాలు అనే వారు ఈ కాన్సెప్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరు. ఇంతటి వ్యతిరేకత మధ్య కూడా ఈ హోటల్స్‌కు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది.

యువతే టార్గెట్:
మన దేశంలో ఇప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న జంటలు చాలా తక్కువ. ఓ సర్వే ప్రకారం.. దేశంలో ఏటా కేవలం 3 శాతం మాత్రమే ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారట.
ఇక అమ్మాయిలైనా, అబ్బాయిలైనా పెళయ్యేవరకు దాదాపు తల్లిదండ్రులు, పెద్దలతోనే కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.
దీంతో ‘మాకు ప్రైవసీ లేకుండా పోతోందం’టూ ఎంతోమంది చెబుతున్నారు. ఒకవేళ ప్రైవసీ కోసం వేరే దారులు వెతుక్కుని… ఎక్కడైనా అబ్బాయి-అమ్మాయి కలిసి కనిపించారో అంతే. ఖాకీలు పట్టుకుని స్టేషన్‌కి తీసుకెళతారు.
ఇంకొన్నిసార్లు దేశ సంస్కృతిని కాపాడుతున్నామని చెప్పే కొంతమంది చేతుల్లో తన్నులు కూడా తినాల్సి వస్తుంది. దీంతో యువతకు ప్రైవసీ దొరకని పరిస్థితి. ఆ పరిస్థితినే ఈ లవ్ హోటల్స్ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.

ప్రైవసీనే లక్ష్యం:
మన దేశంలో అమ్మాయిలు-అబ్బాయిలు వ్యాలెంటైన్స్ డే జరుపుకోవడమంటే మామూలు విషయం కాదు.
నచ్చిన వారితో కొంతసేపు కలిసి గడపాలనుకున్నా.. ఎప్పుడైనా వారితో కలిసి ఎక్కడికైనా వెళ్లి హ్యాపీ ముమెంట్స్ షేర్ చేసుకుందామనుకున్నా.. ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అలాంటి సమస్యలను దూరం చేసి యువతకు ప్రైవసీ కల్పించడమే ఈ లవ్ హోటల్స్ లక్ష్యం అంటున్నాయి సదరు ఫ్లాట్‌ఫాంల యజమాన్యాలు.

కాన్సెప్ట్ కొత్తదేం కాదు:
ఈ లవ్ హోటల్స్ కాన్సెప్ట్ మన దేశానికి కొత్త కావచ్చు. కానీ ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇప్పటికే ఈ కాన్సెప్ట్ బాగా పాపులర్ అయింది. జపాన్ లాంటి దేశాల్లో దాదాపు అర్థ శతాబ్దం క్రితం నుంచే ఈ లవ్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.
అక్కడి యువత ఈ లవ్ హోటల్స్‌ను ఎంతో ఇష్టపడతాయి కూడా. అదే విషయాన్ని గుర్తించిన మనదేశంలోని కొన్ని కంపెనీలు ఇక్కడ కూడా లవ్ హోటల్స్ ఏర్పాటు చేస్తున్నాయి.
స్టే అంకుల్, బ్రెవిస్టే, ఎంఐస్టే, బ్యాగ్2బ్యాగ్ వంటి అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు ఈ లవ్ హోటల్ ఫెసిలిటీస్‌ని కల్పిస్తున్నాయి.
అలాగే ఓయో యాప్‌లో కూడా రిలేషన్‌షిప్ ఆప్షన్ ద్వారా ఇలాంటి ఫెసిలిటీస్‌ని పొందొచ్చు. యువత కూడా ఈ హోటల్స్‌పై చాలా ఆసక్తి చూపిస్తుండడంతో వీటికి డిమాండ్ బాగా పెరిగుతోంది.
ఇప్పటివరకు దాదాపు 100 వరకు నగరాల్లో, దాదాపు 2000 వరకు హోటల్స్ ఈ ఫ్లాట్‌ఫాంలలో రిజిస్టర్ అయ్యాయి.

హోటల్స్‌తో కాంట్రాక్ట్:
ప్రస్తుతం ఓయో హోటల్స్, ఓయో రూంలు ఎలా పనిచేస్తున్నాయో ఈ లవ్ హోటల్స్ కూడా అలానే పనిచేస్తాయి. హోటల్స్‌తో కాంట్రాక్ట్ చేసుకుంటాయి.
ఎవరైనా ఈ యాప్స్‌లో రిజిస్టర్ అయి రూమ్ బుక్ చేసుకోవచ్చు. అలా బుక్ చేసుకున్నవారికి అక్కడికి దగ్గరలో ఉన్న లేదా కోరుకున్న హోటల్స్‌లో రూం బుక్ చేసుకోవచ్చు.
అక్కడికి తన పార్ట్‌నర్‌తో కలిసి వెళ్లి హ్యాపీగా కొంత సమయం గడిపి రావచ్చు.
ఇది ఓ రోజు కావచ్చు. కొన్నిగంటలే కావచ్చు. మీకు నచ్చినంత సేపు ఉండి రావచ్చు. అంతేకాదు లవ్ హోటల్స్‌కు వచ్చిన జంటలకు హోటల్ యాజమాన్యాలు ఓ చిన్న కిట్‌ను కూడా అందిస్తుంది.
అందులో కండోమ్స్, పెర్‌ఫ్యూమ్స్.. ఇలా అవసరమైన కొన్ని వస్తువులు ఉంటాయి.

వ్యతిరేకంగా ధర్నాలు:
ఈ లవ్ హోటల్స్ ఎంతగా పాపులర్ అవుతున్నాయో. వీటిపై వ్యతిరేకత కూడా వస్తోంది. అనేక ప్రాంతాల్లో స్థానికులు వీటిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
కొంతమందైతే.. దేశ సంస్కృతిని ఇలాంటి హోటల్స్ దెబ్బ తీస్తాయని, వీటివల్ల భారతదేశ సంప్రదాయం నాశనమైపోతుందంటూ రోడ్లెక్కి ధర్నాలు కూడా చేస్తున్నారు.
ఇంకొంతమందైతే ఈ హోటల్స్‌ను వేశ్య గృహాలతో పోల్చుతున్నారు కూడా. అయితే నిజంగా ఈ లవ్ హోటల్స్ దేశ సంస్కృతిని దెబ్బతీస్తాయని మీరనుకుంటున్నారా..? లేకపోతే ఇలాంటివి మన యువతకు కూడా కావలసిందేనా..?
#Couple Friendly #LoveHotels #India #Demand #Contracts