

City cried for Beggers Death | ఏ ఊరినీ ఉద్ధరించలేదు. ఎవరికీ సాయం చేయలేదు. ఇంకా మాట్లాడితే అందరి దగ్గర అడుక్కునేవాడు. అవును అతడో యాచకుడు. మానసిక వికలాంగుడు. ఈ మధ్యనే అమ్మను పోగొట్టుకున్న అనాథగా కూడా మారాడు. అమ్మలేదన్న బాధో, అనారోగ్యమో.. ఏదైతేనేం కొద్ది రోజుల క్రితం చివరి శ్వాస విడిచాడు. సాధారణంగా యాచకులు చనిపోతే ఎవ్వరూ పట్టించుకోరు. మున్సిపాలిటీ వాళ్లు ఆ శవాలను తీసుకెళ్లి ఖననం చేస్తారు.
కానీ ఇక్కడ అతడి మరణం ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరినీ బాధించింది. కన్నీరు పెట్టించింది. అందరూ ఒక్కటై అతడి అంతిమయాత్రకు తరలివచ్చేలా చేసింది. ఓ అనాథ యాచకుడి అంతిమయాత్రకు వందల మంది జనం తరలిరావడం ఏంటి..? అతడి మృతిని తట్టుకోలేక ఎలాంటి సంబంధం లేని వారు కన్నీరు పెట్టడం ఏంటి..? భారీ వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లడం ఏంటి..? పట్టణ పెద్దలు సైతం దగ్గరుండి ఖననం చేయించడం ఏంటి..?
అతడి పేరు హుచ్చబస్య. కర్ణాటకలోని విజయనగర జిల్లా హూవినహడగలి అతడి నివాస పట్టణం. మానసిక వికలాంగుడైన అతడు ఈ మధ్యనే తన తల్లిని కోల్పోయి అనాథగా మారాడు. గత శనివారం హూవినహడగలి ప్రాంతంలో రహదారి ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. అతడి మృతి అక్కడి వారందరినీ కలచివేసింది. అందరినీ ప్రేమతో అప్పాజీ అని పిలుస్తూ ఓ రూపాయి ఇవ్వమంటూ అడిగి తీసుకునేవాడు. అంతకన్నా ఎక్కువ ఇచ్చినా తీసుకునేవాడు కాదు.
అతనికి రూపాయి ఇస్తే మంచి జరుగుతుందని అంతా నమ్మేవారు. అందుకే అతడిని అదృష్టం బస్య అని పిలిచేవారు. అలాంటి బస్య చనిపోవడంతో అక్కడి వారంతా కలిసి అతడి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రముఖ కూడళ్లలో బ్యానర్లు, ప్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. అతడి అంతిమయాత్రను ఘనంగా నిర్వహించారు. ఓ యాచకుడికి ప్రజలు ఈ స్థాయిలో అంతిమయాత్ర నిర్వహించడం బహుశా ప్రపంచంలో ఇదే తొలిసారేమో..!