

Space | ప్రస్తుతం ప్రపంచంలోని అనేక సంస్థలు సౌరకుటుంబంలోని ఇతర గ్రహాలపై పరిశోధనలు చేస్తున్నాయి. మనుషులను ఇతర గ్రహాలపైకి పంపించాలని ప్లాన్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి. తాజాగా దీనిపై శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. ఇతర గ్రహాలకు వెళ్లడం మానవుడికి అంత మంచిది కాదని వారు అంటున్నారు.
తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించిన ఈ విషయాలు ఇతర గ్రహాలపైకి వెళ్లాలన్న మానవుడి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. వారి నివేదిక ప్రకారం ఇతర గ్రహాలపై కాలనీలు ఏర్పరుచుకోవడం, వాటిని నివాస యోగ్యం చేసుకోవడం మనిషి మనుగడకే ప్రమాదం అని అంటున్నారు. అయితే ఇప్పటికే శాస్త్రవేత్తలు చందమామ, అంగారక గ్రహం, క్యాలిస్టో, శని గ్రహ ఉపగ్రహం టైటాన్‌పై పరిశోధనలు చేసి, అవి మానవ నివాసానికి అనువైనవని తెలిపారు.
అయితే తాజాగా బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌కు చెందిన ప్రొఫెసర్ చార్లెస్ కాకెల్ సంచలన విషయాలు వెల్లడించారు. మానవుడు తాను అనుకున్నట్లు ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరుచుకుంటే అక్కడ ఆహార విషయంలో అనేక ఇబ్బందులు పడతాడని, వారికి భూమి నుంచి సహాయం అందాలంటే ఏళ్ల సమయం పడుతుందని అంతలో ఆకలిని నివారించుకునేందుకు ఒకరినొకరు చంపుకు తినాల్సి వస్తుందని చార్లెస్ తెలిపారు.
దానికి తోడుగా అక్కడ చికిత్సలు ఉండవని తద్వారా అక్కడ నివసించే మానవాళి మనుగడకు ప్రమాదం వస్తుందని అన్నారు. ఇందుకు ఉదాహరణగా 19వ శతాబ్దంలో ఉత్తర ధ్రువం కోసం జరిగిన పరిశోధనను చూపారు. అప్పట్లో ఉత్తర ధ్రువాన్ని వెత్తుకుంటూ వెళ్లిన పడవలో ఆహారం అయిపోవడంతో వారు ఒకరినొకరు చంపుకు తిన్నారని, ఇక ఇతర గ్రహాల పరిస్థితేంటని చార్లెస్ ప్రశ్నించారు.
అందుకు పరిష్కారంగా ముందుగా అక్కడ పంట పండే అవకాశాలను పరిశోధకులు గమనించాలని వారు తెలిపారు. మరి దీనిపై పరిశోధకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
#Space #Jupiter #Earth #Science