ACB | డ్రైనేజి పైప్‌లో లక్షల సొమ్ము.. ఏసీబీ ముందు మీరెంత మాస్టారూ..!

ACB

ACB: సినిమా స్టైల్లో అవినీతి డబ్బులు దాచాడో అధికారి. ఆ డబ్బును సినిమా స్టైల్లోనే కనిపెట్టారు ఏసీబీ అధికారులు. అది కర్ణాటకలోని కల్బుర్గి ప్రాంతం. స్థానిక పీడబ్ల్యూడీ జాయింట్ ఇంజనీర్ శాంతగౌడ బిరాదర్ ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది. చాలామంది అధికారులు ఇంట్లో తిరుగుతున్నారు. మీడియా సిబ్బంది కెమెరాలతో తిరుగుతున్నారు. ఈ లోగా ఓ ప్లంబర్ అక్కడకు వచ్చాడు. అతడు రాగానే ఓ అధికారి లోపలికి తీసుకెళ్లి ఓ పైప్ చూపించాడు. వెంటనే ప్లంబర్ పైకి ఎక్కి ఆ పైప్ కోయడం మొదలుపెట్టాడు. అసలు ఎవరా అధికారులు..? ఏంటా పైప్ రహస్యం..?
శాంత గౌడ కష్టపడి బాగా అవినీతి చేసి లక్షల రూపాయల డబ్బు, బంగారు ఆభరణాలు సంపాదించాడు. అవినీతి సొమ్ము కదా.. ఎక్కడ దాచిపెట్టాలా అని ఆలోచించాడు. ఎవ్వరికీ దొరక్కుండా ఉండాలని ఇంటికి అమర్చిన ఓ డ్రైనేజ్ పైప్‌లో ఆ మొత్తాన్ని దాచాడు. ఇంతలో ఆయన దగ్గర అవినీతి సొమ్ము ఉందని ఎలా తెలిసిందో ఏసీబీ అధికారులు అతని ఇంటిపై దాడి చేశారు. అంతా వెతికారు. ఏం దొరకలేదు. కానీ ఎలా కనిపెట్టాడో ఓ అధికారికి ఇంటి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న డ్రైనేజీ పైప్ తేడాగా అనిపించింది. వెంటనే మిగతావారికి ఆ విషయం చెప్పాడు. అంతా కలిసి పరిశీలిస్తే.. అందులో ఏదో ఉందని అర్థమైంది. వెంటనే ఆ పైప్ కోయాలని నిర్ణయించుకున్నారు. ప్లంబర్‌ని పిలిచి పైప్ కట్ చేయించి చూస్తే.. వాళ్ల అనుమానం నిజమైంది.

అందులో దాదాపు రూ.25 లక్షల నగదు, కొన్ని బంగారు ఆభరణాలు అధికారులకు చిక్కాయి. వాటిని సీజ్ చేసిన ఏసీబీ ఆఫీసర్లు.. కేసు నమోదు చేశారు. ఇదంతా చూస్తే ‘తాడిని తన్నేవాడుంటే వాడి తల దన్నేవాడు మరొకడుంటాడు’ అనే సామెత గుర్తుకొస్తోంది. ఏమంటారు..?