

ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ సంఘటన సినీ ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది. సీతారామశాస్త్రి మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌లో భావోద్వేగ సందేశం పోస్ట్ చేశారు. ‘తెలుగు సినీ పరిశ్రమకి నేడు చీకటి రోజు. సిరి వెన్నెల మరణం తీరని లోటు’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు.. ‘గొప్ప ప్రతిభ, అంతకుమించిన గొప్ప వ్యక్తిత్వం రెండూ ఒకే దేహంలో ఇమిడి ఉన్న అతిగొప్ప వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి. అటువంటి మహనీయుడు ఇకలేరు అన్న వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
‘జగమంత కుటుంబం మీది. మీరు లేక ఏకాకి జీవితం మాది. ఆయన మరణం పూడ్చలేనిది. మిమ్మల్సి మించిన గురువు లేరు’ అని ప్రకాష్ రాజ్ సంతాపం తెలిపారు. ‘సిరివెన్నెల మరణించారన్న వార్తను నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మనసు ఆ చేదు నిజాన్ని అంగీకరించడం లేదు. తన సాహిత్యంతో తెలుగు చలనచిత్ర సంగీతానికి మహోన్నత అర్థాన్ని అందించిన గొప్ప వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని యంగ్ హీరో నితిన్ అన్నాడు.
‘నా తొలినాళ్లలో తెలుగు నేర్చుకుంటున్న సమయంలో తెలుగు కవిత్వాలను ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలో అలవోకగా నేర్పించారు. తెలుగంటే తెలియని నాకు సైతం తెలుగు భాషపై ప్రేమ కలిగేలా చేసిన మహనీయుడు ఆయన’ అని హీరో సిద్ధార్థ అన్నాడు. ఇక ఆయన అభిమానులు కూడా.. ‘సిరివెన్నెల లేని లోటు తీరనిది. అటువంటి సాహిత్య వేత్త మరొకరు లేరు. రారు అంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.