

Rohit Sharma | టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడంతో రోహిత్ శర్మకు ఆ బాధ్యత దక్కింది. ఇక వన్డే కెప్టెన్సీ నుంచి ఏకంగా కోహ్లీని తప్పించి మరీ రోహిత్‌ను కెప్టెన్‌ను చేసింది బీసీసీఐ. ఈ నిర్ణయంపై ఇప్పటికీ కొంత వ్యతిరేకత ఉంది. కానీ బీసీసీఐ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వచ్చింది.
మరికొద్ది రోజుల్లో దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు కోహ్లీ.. వన్డేలకు రోహిత్ కెప్టెన్లుగా జట్లను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఇప్పటికే స్వదేశంలో కెప్టెన్ గా తొలి టీ20 సిరీస్ ను 3-0 తేడాతో గెలిచి సత్తా చాటాడు రోహిత్. ఇక ఇప్పుడు వన్డేల్లో తానేంటో నిరూపించుకోవాలి. అయితే టీం ఇండియాను తొలిసారి వన్డేల్లో నడిపించబోతున్న రోహిత్.. ముఖ్యంగా సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- జట్టును సమతూకంతో నడిపించడం:
వన్డేలకు అనుభవం మాత్రమే సరిపోదు. వేగం, ఫిట్నెస్ అన్నీ ప్రధానమే. అందుకే జట్టులో అనుభవజ్ఞులైన సీనియర్ ఆటగాళ్లతో పాటు కుర్రాళ్లకూ సమాన అవకాశాలివ్వాలి. కేవలం ఓ ఫార్మాట్ వరకే పరిమితం అయితే పుజారా, రహానేలలా తయారవుతారు కుర్రాళ్ళు. అందుకే వాళ్ళకి తగిన అవకాశాలివ్వాలి. - కోహ్లీని పూర్తిగా ఉపయోగించుకోవాలి:
టీం ఇండియాను 3 ఫార్మాట్లలో అద్భుతంగా నడిపించిన సారథి కోహ్లీ. ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్లో కేవలం ఆటగాడిగా బరిలోకి దిగబోతున్నాడు. కెప్టెన్ గానే కాక ఆటగాడిగా కోహ్లీ రికార్డ్ అద్భుతం. అలాంటి ఆటగాడిపై ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు కూడా లేవు. అందువల్ల అతడి నుంచి పూర్తి స్థాయి ఆటను రాబట్టాలి. - టార్గెట్ 2023 వరల్డ్ కప్:
2019 ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్.. ఈ టోర్నీలు ఇండియాకి పెద్ద గుణపాఠాలు. సరైన ప్రణాళిక, సన్నద్ధత లేకుండా బరిలోకి దిగితే ఎలాంటి పరాభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో ఈ టోర్నీలు రుజువు చేశాయి. ఇక ఇప్పుడు ఇండియా టార్గెట్ 2022 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే ప్రపంచకప్. ఈ టోర్నీలకు సరైన ప్రణాలికను ఇప్పటినుంచే సిద్ధం చేసుకోవాలి. అందుకు కోహ్లీఏ దగ్గర సరిపడా సమయం కూడా ఉంది. ముఖ్యంగా ఆటగాళ్లలో ప్రతిభను గుర్తించి మెరికల్లాంటి ఆటగాళ్లను గుర్తించడంలో రోహిత్ సక్సెస్ కావాలి. అప్పుడే గాయాల పాలవ్వని ఆటగాళ్లు, ప్రతిభావంతులైన ప్లేయర్స్ తో నిండిన జట్టు ప్రపంచకప్ లో సత్తా చాటగలుగుతుంది.
మరి ఈ సవాళ్ళను ఎదుర్కోగలడా..? ఆటగాడిగా సక్సెస్ అయిన రోహిత్.. కెప్టెన్ గా నిరూపించుకోగలడా..? సరైన మార్గానిర్దేశకుడిగా పేరు తెచ్చుకోగలడా..? ఈ ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.