
RRR | ప్రస్తుతం సినీ ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేవ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ సినిమాపై ఉన్న అంచనాలు అంతకంతా పెంచేస్తున్నాయి. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అప్‌డేట్ కూడా సినిమా స్థాయిని అంచలంచలుగా పెంచుతూనే వస్తున్నాయి.
ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సోల్ ఆంథెమ్ ‘జననీ’ దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను కదిలించింది. పాట చూసినంత సేపు లిరిక్స్‌కి తగ్గట్టుగా విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ పాట తరువాత ప్రమోషన్స్‌లో భాగంగా జక్కన్న ఏ అప్‌డేట్ ఇవ్వనున్నాడని అందరూ ఎదురుచూస్తుండగా ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ చేసి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు.
అయితే ఆ తరువాత ట్రైలర్‌ను అనుకున్న సమయానికి విడుదల చేయట్లేదని నిరాశ పరిచినన్పప్పటికీ ఆ సమయానికి అభిమానులు ఔరా అనేలా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ పోస్టర్‌తో ఆర్ఆర్ఆర్‌ను మళ్లీ హాట్‌టాపిక్‌గా మార్చారు. ఈ పోస్టర్‌లో ఎన్‌టీఆర్ నెత్తురోడుతున్న శరీరంతో కనిపిస్తున్నాడు.
శరీరం నిండా గాయాలయినప్పటికీ పట్టువదలకుండా తన చేతిలోని తాళ్లను పట్టుకొని ఉన్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సీన్ ఎంతో భావోద్వేగానికి గురిచేస్తుందని అర్థం అవుతోంది. ఇంతలో రామ్ చరణ్ పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో చెర్రీ భారీ యాక్షన్ సీన్‌లో ఉన్నట్లు అర్థం అవుతోంది.
షర్ట్ లెస్ సీన్‌లో జూలు విదిలిస్తోన్న సింహంలో చెర్రీ కనిపిస్తున్నాడు. అంతేకాకుండా శత్రువులను చీల్చిచెండాడేందుకు సిద్దంగా ఉన్నట్లు అర్థం అవుతోంది. ఈ రెండు సీన్‌లు సినిమాలో ప్రేక్షకుల ఊహాలను దాటడం పక్కా అని అభిమానులు అంటున్నారు. మరి ఈ సీన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.