

US Shooting | స్కూలుకు వెళ్లేందుకు బస్టాప్‌కు రావడమే ఆ కుర్రాడి ప్రాణాల మీదకు తెచ్చింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న అతనిపై అటుగా వచ్చిన ఒక కారులో నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తే వెంబడించి మరీ ఆ కుర్రాడి ప్రాణాలు తీశారు ఆ కారులోని దుండగులు. ఆ తర్వాత ఏమీ పట్టనట్లు వెళ్లిపోయారు. ఈ ఘటన అమెరికాలోని ఫిలడెల్ఫియాలో వెలుగు చూసింది. సమీర్ జెఫర్‌సన్ (14) అనే కుర్రాడు బస్టాండ్‌లో ఉండగా ఈ ఘోరం జరిగింది. ఫెల్టాన్‌విల్లె ప్రాంతంలో సోమవారం నాడు పట్టపగలే కాల్పులు జరిపి సమీర్‌ను హతమార్చారు. అటుగా వచ్చిన కారులో నుంచి దిగిన ఇద్దరు దుండగులు 35 సార్లు సమీర్‌ను కాల్చారని అధికారులు వెల్లడించారు.
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత సమీర్‌ను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ కేసు విచారణ చేస్తున్న అధికారులు ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. అయితే వారు నిర్దోషులని తేలడంతో మంగళవారం నాడు వారిని విడుదల చేసేశారు. ‘బస్సు కోసం ఎదురు చూస్తున్న కుర్రాడిపై కొంతమంది 30 సార్లు కాల్పులు జరపడం చాలా బాధాకరం. ఈ హత్య వెనుక కారణం ఇంకా తెలియలేదు’ అని పోలీసులు చెప్పారు.
ఇది కూడా చదవండి: NRI | అమెరికాలో తెలుగు వారే టాప్.. ఎన్నారైల్లో ఎంత శాతమంటే?
కుటుంబంలో ఎంతో సంతోషాన్ని నింపే తమ్ముడు చనిపోవడం తీరని లోటని సమీర్ అక్క కన్నీరుమున్నీరైంది. ఇక్కడ థాంక్స్‌గివింగ్ పండుగ వీకెండ్‌లో జరిగిన ఐదో కాల్పుల ఘటన ఇది. ఇప్పటి వరకూ ఈ ఏడాదిలో ఫిలడెల్ఫియాలో సుమారు 2వేల కాల్పుల ఘటనలను నమోదైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. చనిపోయిన వారిని తాము తిరిగి తీసుకురాలేమని, కానీ వారికి న్యాయం చేకూర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని పోలీసులు పేర్కొన్నారు.