

Four Day Work | ఎడారి దేశం యూఏఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల సంప్రదాయాలకు మరింత దగ్గరయ్యేందుకు గానూ.. ఇక్కడ కూడా ప్రతి వారం శని, ఆదివారాలను సెలవులుగా ప్రకటించింది. ఇక్కడ ఇంతకు ముందు వరకూ శుక్ర, శని వారాలు సెలవలు ఉండేవి. మిగతా రోజులు పనిచేయాల్సిందే.
అంటే ఆదివారం కూడా ఆఫీసులు ఉండేవన్నమాట. అయితే తాజాగా ఈ పద్ధతిని మారుస్తూ యూఏఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల జనవరి 1 నుంచి ప్రతివారం శని, ఆదివారాలు సెలవులుగా ప్రకటించింది. అదే సమయంలో ఇక్కడ శుక్రవారం హాఫ్ డేగా నిర్ణయించింది. ఇక్కడ ఇంతకుముందు శుక్రవారం సెలవుగా ఉండేది.
ఆ రోజు సగం రోజు పని చేసి ఇళ్లకు వెళ్లిపోవచ్చన్నమాట. ఆ తర్వాతి రెండ్రోజులు పూర్తిగా సెలవు. అంటే వారంలో కేవలం నాలుగున్నర రోజులు మాత్రమే పనిచేస్తారు. ఈ నిర్ణయాన్ని అనుసరించి షార్జాలోని ప్రభుత్వ సంస్థలు కూడా సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇక్కడి ప్రభుత్వ ఆఫీసులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి.
మిగతా మూడ్రోజులు ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం నుంచి గురువారం వరకూ పనిదినాలుగా ఉండగా, శుక్రవారం నుంచి ఆదివారం వరకూ సెలవులుగా నిర్ణయించింది.