Movie Tickets | సినీ ఇండస్ట్రీకి షాక్.. ఏపీ టికెట్ రేట్లు ఇవే..


కొన్నాళ్లుగా ఏపీలో సినిమా టిక్కెట్ ధరల విషయం హాట్ టాపిక్‌గా ఉంది. టికెట్ ధరల విషయం ప్రభుత్వం పునరాలోచన చేయాలంటూ సినీ తారలు సైతం కోరారు. అయితే తాజాగా ఆన్‌లైన్ టికెట్ ధరలపై ఏపీ సర్కార్ ఓ నిర్ణయానికొచ్చింది. ఈ క్రమంలో అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణను ఆమోదించింది. దీని ప్రకారం ఇకపై సినిమా టికెట్ ధరలు ఎవరికి నచ్చినట్టు వారు పెంచడం ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్ ఇవ్వాలి. ఈ ధరలను మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల వారీగా పరిగణించింది.
అంతేకాకుండా బెన్‌ఫిట్ షోలు అనేవి ఇకమీదట లేవని, వాటికి మాత్రం అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పింది. వాటితో పాటుగా అదనపు షోలను కూడా ఇకపై అనుమతించేది లేదని స్పష్టం చేసింది. టికెట్ రేట్లకు సంబంధించిన పట్టికలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలను రూ.5 నుంచి రూ.250 వరకు నిర్ణయించింది.
మున్సిపల్ కార్పొరేషన్: మల్టీప్లెక్స్‌లలో ప్రీమియం రూ.250, డీలక్స్-రూ.150, ఎకానమీ రూ. 75 గా ఉండగా ఏసీ లేదా ఎయిర్ కూల్‌లో ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40లుగా ఉన్నాయి. అదే విధంగా నాన్ ఏసీలో ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20గా నిర్ణయించబడ్డాయి.
మున్సిపాలిటీలు : మల్టీప్లెక్స్‌లలో ప్రీమియం రూ.150, డీలక్స్-రూ.100, ఎకానమీ రూ. 60 గా తెలిపింది. అలాగే ఏసీ లేదా ఎయిర్ కూల్‌లో ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30లుగా ఉన్నాయి. అదే విధంగా నాన్ ఏసీలో ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15గా తేల్చి చెప్పింది.
నగర పంచాయతీలు: మల్టీప్లెక్స్‌లలో ప్రీమియం రూ.120, డీలక్స్-రూ.80, ఎకానమీ రూ.40 గా ఉండగా ఏసీ లేదా ఎయిర్ కూల్‌లో ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15లుగా ఉన్నాయి. అదే విధంగా నాన్ ఏసీలో ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10గా నిర్ణయించబడ్డాయి.
గ్రామ పంచాయతీలు: మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ. 30 గా ఫిక్స్ అయ్యాయి. ఏసీ లేదా ఎయిర్ కూల్‌లో ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10లుగా నిర్ణయించారు. అలాగే నాన్ ఏసీలో ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5గా నిర్ణయించబడ్డాయి.
