పతక గ్రహీతలకు మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ: పారా ఒలింపిక్స్‌లో భారత్ దూసుకుపోతుంది. వరుస పతకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తోంది. ఈరోజు సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్స్‌లోనూ ప్రమోద్ భగత్ తన తడాఖా చూపించాడు. బ్రిటన్ షట్లర్ డేనియల్ బెతెల్‌ను ఓడించాడు. రెండు వరుస సెట్లతో తన సత్తా చాటి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే సమయంలో భారత షట్లర్ మనోజ్ సర్కార్ కాంస్య పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పారా ఒలిపింక్స్‌లో పతక గ్రహీతలను ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రమోద్ భగత్ తనదైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడని, అద్భుత ప్రదర్శనతో ప్రతి భారతీయుడి హృదయాన్ని దోచుకున్నాడని మోదీ అన్నారు. ప్రమోద్ ఒక ఛాంపియన్, అతడి విజయం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. కాంస్య విజేత మనోజ్ సర్కార్ చక్కని ఆటతీరు కనబరిచారని మోదీ మెచ్చుకున్నారు. వారు ఇదే తరహాలో రాణిస్తూ భారత్‌కు మరిన్ని పతకాలు సాధించాలని అన్నారు.