

Talaiva | టీమిండియా యువ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ అదరగొడుతున్నాడు. ఈ మధ్యనే న్యూజిల్యాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన అయ్యర్.. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగి ఆడుతున్నాడు. మధ్యప్రదేశ్-చండీఘర్ మధ్య ఆదివారం వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 56-4 తో పీకల్లోతు కష్టాల్లో మధ్యప్రదేశ్ ఉన్న సమయంలో బ్యాటింగ్ కి వచ్చాడు అయ్యర్. తొలి బంతి నుంచే ధాటిగా ఆడాడు. 88 బంతుల్లోనే సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. సెంచరీ పూర్తి కాగానే టీమ్ డగౌట్ వైపు సైగ చేస్తూ సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ లో సెల్యూట్ చేశాడు. అలాగే రజినీలా కళ్ళజోడు తిప్పి పెట్టుకున్నట్లు చూపించాడు. ఈ వీడియోను అయ్యర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ తన ట్విట్టర్లో షేర్ చేసింది.
రజనీకాంత్ అంటే అయ్యర్ కు వల్లమాలిన అభిమానం. తమిళ కుటుంబంలో పుట్టడంతో రజినీకి చిన్నప్పటి నుంచే అయ్యర్ పెద్ద ఫ్యాన్. ఈ క్రమంలోనే ఆదివారం తన అభిమాన నటుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనపై తనకున్న అభిమానాన్ని ఇలా చూపించుకున్నాడు అయ్యర్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కాగా.. ఈ మ్యాచ్ లో అయ్యర్ మొత్తం 113 బంతుల్లో 151 పరుగులు చేశాడు. అందులో 8 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి. అయ్యర్ విజృంభణతో మధ్యప్రదేశ్ మొత్తం 9 వికెట్లను 331 పరుగుల భారీ స్కోరు చేసింది. అలాగే ఈ టోర్నీలో ఇప్పటికే 7 వికెట్లు కూడా తీశాడు. అంతేకాదు ఈ టోర్నీలో కేవలం 4 మ్యాచ్ లలోనే 348 పరుగులు చేశాడు. 87 స్ట్రైక్ రేట్ తో 138.64 యావరేజ్ తో టాప్-2 హయ్యెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ జరుగుతుండగానే దక్షిణాఫ్రికా వెళ్లబోతున్న వన్డే జట్టుకు అయ్యర్ ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.