2021 | భారత్ తల దించుకునేలా చేసిన టీమిండియా

2021
2021 | కొన్ని మధురమైన విజయాలు.. జీర్ణంకాని అపజయాలు.. అనూహ్య నిష్క్రమణలు.. భారత క్రికెట్‌లో 2021 చోటుచేసుకున్న ఎన్నో సంఘటనలు.
వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోవడంతో ఏడాది ఆరంభించిన టీమిండియా.. అదే జోరును ఏడాదంతా కొనసాగించలేకపోయిందనే చెప్పాలి.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు.. అనూహ్యంగా కివీస్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాక్ చేతిలో ప్రపంచకప్పుల్లో ఓటమి ఎరుగని టీమిండియా.. దాయాది చేతిలో అత్యంత ఘోరంగా ఓడి అభిమానులకు ఆవేదననే మిగిల్చింది.
భారత క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి దేశ అభిమానులంతా తలదించుకునేలా చేసింది. అందుకని భారత జట్టు ఫామ్ కోల్పోయిందా? అంటే అదేమీ లేదు.
ఈ ఏడాది జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లు అన్నింటినీ మనమే గెలుచుకున్నాం. టీ20 ప్రపంచకప్ తర్వాత జరిగిన న్యూజిల్యాండ్ సిరీస్‌లోనూ సత్తాచాటింది టీమిండియా.
ఆ తర్వాత కెప్టెన్సీ వివాదాలు భారత క్రికెట్‌ను చుట్టుముట్టాయి. వన్డే కెప్టెన్‌గా కోహ్లీని తొలగించి రోహిత్‌ను నియమిస్తున్నట్లు సడెన్‌గా ప్రకటించిన బీసీసీఐ పెద్ద బాంబు పేల్చింది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది.

ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కోహ్లీ విభిన్నమైన కామెంట్లు చేయడం ఈ గొడవకు మరింత ఆజ్యం పోసింది.
ఎవరు అబద్ధం చెప్తున్నారు? అనే ప్రశ్న అభిమానులను రెండు వర్గాలుగా విడగొట్టిందనే చెప్పాలి.
మాజీలు సైతం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలంటూ గంగూలీని ప్రశ్నించారు. ఈ వివాదాల మధ్యనే సౌతాఫ్రికా బయలుదేరిన భారత జట్టు.. సఫారీల కంచుకోట సెంచూరియన్‌లో జయభేరి మోగించి ఏడాదిని ముగించింది.
ఇప్పటివరకూ అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్‌తో ఆడిన భారత జట్టు.. తొలిసారిగా వైట్‌బాల్ క్రికెట్‌లో ఒక కెప్టెన్, టెస్టుల్లో మరో కెప్టెన్ ఇలా ఇద్దరు కెప్టెన్లతో ఆడనుంది.
ఏదేమైనా వచ్చే ఏడాది ఇంతకన్నా ఘనంగా ఉండాలని కోరుకుందాం.
#TeamIndia #Pakisthan #WorldCup #2021 #2022