

SRH | ఐపీఎల్ 2021 అయిపోయింది. ఇంకొన్ని నెలల్లో ఐపీఎల్ 2022 కూడా మొదలు కాబోతోంది. ఈ టోర్నీ ముందు ఆటగాళ్లతో ఫ్రాంచైజీల కాంట్రాక్టులు పూర్తి కానుండడంతో మెగా వేలం జరగబోతోంది. జనవరిలో ఈ వేలం జరగనుండగా.. అనేకమంది యువ ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లు వేలంలో నిలవనున్నారు. దీంతో ఈ వేలంపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఏ ఆటగాళ్లను తీసుకుంటుందో అని ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్ లాంటి ఆటగాళ్లను రైజర్స్ వదులుకోవడంపై గుర్రుగా ఫాన్స్ ఇప్పుడు ఎవరిని తీసుకుంటారా అని చూస్తున్నారు.
ఇలాంటి టైంలో ఫాన్స్ కి రైజర్స్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే.. తమ ఫ్రాంచైజీతో కలిసి విండీస్ దిగ్గజం, మాజీ ఆటగాడు బ్రియాన్ లారా, సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ బౌలర్, స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ పని చేయబోతున్నట్లు తెలిపింది.
ఐపీఎల్ 2022 కోసం తమ కోచింగ్ సిబ్బందిలో అనేక మార్పులు చేసినట్లు రైజర్స్ గురువారం ప్రకటించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. కొత్త కోచింగ్ స్టాఫ్ వివరాలను వెల్లడించింది.
అందులో.. గత సీజన్ వరకు జట్టు డైరెక్టర్ గా ఉన్న టామ్ మూడీని జట్టు కోచ్ గా నియమించింది. ఇంతకు ముందు కూడా మూడీ రైజర్స్ కి కోచ్ గా వ్యవహరించాడు. 2016లో టోర్నీ విజేతగా రైజర్స్ నిలిచింది కూడా మూడీ కోచ్ గా ఉన్నప్పుడే.

ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ సైమన్ కటిచ్ ఈ సారి రైజర్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరించబోతున్నాడు. కటిచ్ గత సీజన్ తొలి భాగంలో ఆర్సీబీకి హెడ్ కోచ్ గా ఉన్నాడు.
అలాగే విండీస్ లెజెండ్ బ్రియాన్ లారాని జట్టు వ్యూహాత్మక సలహాదారుగా, బ్యాటింగ్ కోచ్ గా నియమించుకుంది.
అదే విధంగా ప్రోటీన్ మాజీ స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ ని బౌలింగ్ కోచ్ గా నియమించింది.
ఇక రైజర్స్ తో ఎంతో అనుబంధం ఉన్న మత్తయ్య మురళీధరన్ ని జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్ గా, వ్యూహకర్తగా తీసుకుంది. ఇక మాజీ టీమిండియా ఆటగాడు హేమాంగ్ బదానీని జట్టు ఫీల్డింగ్ కోచ్ గా తీసుకుంది. ఇక ఈ కొత్త సిబ్బంది బృందానికి SRH THINK TANK అని పేరు పెట్టింది.
కాగా.. గత సీజన్ లో రైజర్స్ దారుణంగా విఫలమైంది. ఒక్క విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలోనే జట్టును, సిబ్బందిని ప్రక్షాళన చేసే పనిలో పడింది రైజర్స్ యాజమాన్యం. అందులో భాగంగానే ఇలాంటి కీలక మార్పులను చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ మార్పులతో అయినా వచ్చే టోర్నీలో మెరుపులు మెరిపిస్తుందేమో చూడాలి. అయితే వేలంలో సొంతం చేసుకునే ఆటగాళ్ళపై కూడా ఇది ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు.
#SRH #SunRisersHyderabad #BrianLara #DaleSteyn