
Sardul Thakur

Sardul Thakur | భారత క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు మిథాలి పారుల్కర్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ జంట నిశ్చితార్థం సోమవారం జరిగింది.
ముంబైలో బీకేసీలోని ముంబై క్రికెట్ అసోసియేషన్ ఫెసిలిటీలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. మొత్తం 75 మంది అతిథుల మధ్య ఈ వేడుక జరిగింది. క్రికెటర్లలో రోహిత్ శర్మ, అభిషేక్ నాయర్, ధవల్ కులకర్ణి ఈ వేడుకకు హాజరయ్యారు.
కాగా.. శార్దూల్ ఠాకూర్ కాబోయే భార్య మిథాలి పరుల్కర్, శార్దూల్ ఠాకూర్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. మిథాలి థానేలో ఆల్ ది బేక్స్ అనే స్టార్టప్ కంపెనీని నడుపుతోంది.
శార్దూల్ ఠాకూర్ గత నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇటీవల జరిగిన T20 ప్రపంచకప్‌లో భారత్ తరపున ఆడాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి కొంత విరామం తీసుకున్నాడు. ఈ నిశ్చితార్థం కోసమే అతడు విరామం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం శార్దూల్ ఠాకూర్ వయసు 30 ఏళ్లు. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌లో అటు బ్యాటింగ్‌తోనూ, ఇటు బౌలింగ్‌తోనూ అదరగొడుతున్నారు. అద్భుతమైన ఫామ్‌లో మెరుస్తున్నాడు.