

Cricket | బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2022లో ఆండ్రూ రస్సెల్ రనౌట్ అయిన విధానం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. శుక్రవారం ఖుల్నా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మినిస్టర్ గ్రూప్ ఢాకా తరపున బరిలోకి దిగిన విండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఊహించని విధంగా అవుటయ్యాడు.
ఇన్నింగ్స్ 15వ ఓవర్లో శ్రీలంక వెటరన్ ఆల్ రౌండర్ థిసారా పెరీరా విసిరిన ఐదో బంతిని రస్సెల్ థర్డ్ మ్యాన్ వైపుగా నెట్టి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మెహెదీ హసన్ బంతిని అందుకున్నాడు.
నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మహమ్మదుల్లా వేగంగా పరిగెత్తుకుంటూ రన్ పూర్తి చేశాడు. సరిగ్గా మహమ్మదుల్లా క్రీజులో బ్యాట్ పెట్టే సమయానికి మెహెదీ హసన్ విసిరిన బంతి వికెట్లను తాకింది. దీంతో అతడు రనౌట్ నుంచి తప్పించుకున్నాడు.

అయితే అటు వైపు వికెట్లకు బంతి తగలడంతో నాన్ స్ట్రైకర్ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న రస్సెల్ కాస్త నెమ్మదించాడు. వెనక్కి తిరిగి చూస్తు ముందుకు రాసాగాడు. అయితే ఇంతలో బంతి ఊహించని విధంగా అటు వికెట్లకు తగిలి నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్ వికెట్ల వైపు దూసుకొచ్చింది.
ఏం జరుగుతుందో కూడా అందరికీ అర్థమయ్యేలోపే వికెట్లను గిరాటేసింది. దీంతో తేరుకున్న రస్సెల్ వెంటనే బ్యాట్ క్రీజులో పెట్టాడు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే వికెట్లకు బంతి తగలడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు నివేదించగా.. థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు.
ఊహించని విధంగా అవుట్ కావడంతో రస్సెల్ కూడా నవ్వుకుంటూ పెవిలియన్ వైపు వెళ్లిపోయాడు. అవుటయ్యే సమయానికి రస్సెల్ 2 బంతుల్లో 7 పరుగులు చేశాడు. ఇక ఈ వీడియో చూసిన క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం.. ‘ఇదెక్కడి రనౌట్.. ఇలా ఎలా అవుటయ్యావ్ రస్సెల్..!’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.
#Cricket #BangladeshPremierLeague #BPL2022 #AndrewRussel #RunOut