

Rishabh pant | సౌత్‌ఆఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో రిషబ్ పంత్ అవుటైన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇదేమైనా గల్లీ క్రికెట్ అనుకున్నావా..?’ అంటూ మండిపడుతున్నారు. ధవన్ లాంటి సెటిల్ అయిన బ్యాట్స్‌మన్ అవుటైన క్రమంలో క్రీజులోకొచ్చిన పంత్.. మొదటి బంతినే భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి అంతులేకుండా ఉంది.
288 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా.. ఇన్నింగ్స్ 23వ ఓవర్లో 5వ బంతి షార్ట్ పిచ్‌గా విసిరి ధవన్ వికెట్ తీసుకున్న ఫెలుక్వాయో.. 6వ బంతిని కూడా షార్ట్ పిచ్ వేశాడు. అయితే తొలి బంతిని ఎదుర్కొంటున్న పంత్ ముందుకొచ్చి సిక్స్ కొట్టబోయాడు. కానీ చేతిలో బ్యాట్ తిరిగిపోవడంతో బంతి ఎడ్జ్ తీసుకుని మిడ్ వికెట్ మీదుగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మగాలా సునాయాసంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పంత్ పెవిలియన్ చేరాడు.
పంత్ అవుటైన తీరు చూసిన క్రికెట్ అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ‘ఇదేమైనా గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా..? వచ్చిన మొదటి బంతినుంచే భారీ షాట్ ఆడడానికి. లేక అవతలి బౌలర్లేమైనా పిల్లలు అనుకుంటున్నావా..? నీ బ్యాట్‌కి అందేటట్లు బంతులు వేయడానికి’ అంటూ మండిపడుతున్నారు. ఇంకొంతమంది ‘కనీసం బాధ్యత లేకుండా ఆడతావా..? అలాంటి పరిస్థితుల్లో మొదటి బంతినే భారీ షాట్ ఆడడం అవసరమా..?’ అంటూ విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే రెండో వన్డేలో కూడా 85 పరుగులతో టాప్ స్టోరర్‌గా నిలిచిన పంత్.. ఇలాగే అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఆ సందర్భంలో సునీల్ గవాస్కర్ సహా మరికొంతమంది పంత్ ఆటతీరును విమర్శించారు. ఇక ఈ మ్యాచ్‌లో ఏకంగా తొలి బంతినే బాధ్యత లేకుండా ఆడడంపై సగటు క్రికెట్ అభిమానులు కూడా మండిపడుతున్నారు.
కాగా.. టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత వన్డే సిరీస్ అయినా గెలుచుకుందామని అనుకున్న టీమిండియా.. మొదటి రెండు వన్డేల్లో ఘోర పరాజయం చవి చూసింది. దీంతో వన్డే సిరీస్ కూడా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో వన్డేలో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.
#RishabhPant #TeamIndia #INDvsSA #GoldenDuck