
IPL 2022

IPL 2022 | కొద్ది రోజుల క్రితమే ఐపీఎల్ 2021 ముగిసింది. తొలి షెడ్యూల్ మార్చి – ఏప్రిల్‌లో జరిగినా.. కోవిడ్ దెబ్బకి అది వాయిదా పడింది. అయితే రెండో షెడ్యూల్‌ను దుబాయ్‌లో ఏర్పాటు చేసి టోర్నీని ముగించింది బీసీసీఐ.
ఆ సీజన్ అలా ముగిసిందో లేదో ఇలా వచ్చే ఏడాది సీజన్ కోసం రెడీ అయిపోయింది.
దానికి తోడు 2021తో ఆటగాళ్లతో ఫ్రాంచైజీల కాంట్రాక్టులు పూర్తి కానుండడంతో 2022 ప్రారంభంలో మెగా వేలం కూడా జరగనుంది. దీని కోసం ఇప్పటికే బీసీసీఐ ఏర్పాట్లు పూర్తి చేసింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ వేలం జరిగే అవకాశం ఉంది. అయితే ఫ్రాంచైజీలన్నీ ఈ వేలంలో పాల్గొనే ముందు తమ జట్లలో ఉన్న ఆటగాళ్లు అందరినీ కాంట్రాక్టుల నుంచి రిలీవ్ చేయాలి.
వారిని మళ్లీ మిగతా ఫ్రాచైజీలతో పోటీ పడి గెలుచుకోవాలి. అలాగే ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది.

ప్రతి ఫ్రాంచైజీ నాలుగు స్థాయిల్లో ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఏదైనా ఫ్రాంచైజీ నలుగురు ప్లేయర్లనూ రిటైన్ చేసుకుంటే.. మొదటి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ఆటగాడికి రూ.12 కోట్లు, మూడో ఆటగాడికి రూ.8 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ.6 కోట్లు అందించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఏదైనా ఫ్రాంచైజీ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ.7 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
అలాగే ఇద్దరిని రిటైన్ చేసుకుంటే మొదటి ఆటగాడికి రూ.14 కోట్లు, రెండో ఆటగాడికి రూ.10 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
ఒక్కరినే వెనక్కి తీసుకుంటే.. ఆ ఆటగాడు అంతర్జాతీయ స్థాయి ఆటగాడైతో రూ.14 కోట్లు, దేశీయ ఆటగాడైతే రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక ఈ ఏడాది మరో 2 కొత్త ఫ్రాంచైజీలు కూడా ఐపీఎల్‌లో చేరబోతున్నాయి. ఆ ఫ్రాంచైజీలు కూడా నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తాయనడంలో సందేహం లేదు.

ఇదిలా ఉంటే ఇప్పటివరకు బీసీసీఐ రూల్స్ ప్రకారం ఫ్రాంచైజీల గరిష్ఠ కొనుగోలు స్థాయి రూ.85 కోట్లుగా ఉండాలి.
కానీ ఈ మెగా వేలం కోసం బీసీసీఐ ఫ్రాంచైజీల గరిష్ఠ కొనుగోలు పరిమితిని రూ.90 కోట్లకు పెంచింది. అంటే రూ.5 కోట్లు పెంచిందన్నమాట.