
Shaheen Afridi

Shaheen Afridi | పాకిస్తాన్ పేస్ దళానికి నాయకుడిగా ఎదుకుతున్న బౌలర్ షహీన్ షా అఫ్రిది. టీ20, వన్డే, టెస్ట్ అనే తేడా లేకుండా బంతితో మాయ చేస్తున్నాడు. ఈ మధ్యనే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో కూడా తొలి మ్యాచ్ నుంచే ప్రత్యర్థి జట్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే సెమీ ఫైనల్లో ఓటమితో పాకిస్తాన్ ఆ టోర్నీలో ఇంటి దారి పట్టింది.
ప్రస్తుతం పాకిస్తాన్.. బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
షాహీన్‌ను బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ఊహించని విధంగా ట్రోల్ చేశారు. ఓ బౌండరీని ఆపేందుకు డైవ్ చేసిన షాహీన్.. బౌండరీని ఆపలేకపోయాడు. అదే సమయంలో అక్కడున్న బంగ్లాదేశ్ అభిమానులంతా టీ20 ప్రపంచకప్‌ను గుర్తు చేస్తూ ‘మాథ్యూ వేడ్’ అంటూ అరిచి ట్రోల్ చేశారు.
కాగా.. టీ20 ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడిన పాకిస్తాన్ త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది. దాదాపు విజయం ఖాయమైన సమయంలో.. ఆసీస్ బ్యాట్స్‌మన్ మాథ్యూ వేడ్ చెలరేగి ఆడాడు.
షహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లోనే వరుసగా మూడు సిక్స్‌లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. అదే ఓవర్లో మరో పేసర్ హసన్ అలీ.. వేడ్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్‌ను జార విడిచాడు. ఆ తర్వాతి మూడు బంతులను వేడ్ సిక్సర్లుగా మలిచాడు.