వన్డే కెప్టెన్సీ కూడా కోహ్లీ వదిలేస్తాడా?.. రవిశాస్త్రి ఏం చెప్పాడంటే


Virat Kohli ODI Captaincy | టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ.. ఆ బాధ్యతలను వెటరన్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మకు అప్పగించాడు. హెడ్‌కోచ్ రవిశాస్త్రి పదవీకాలం కూడా ఈ టోర్నీతో ముగిసింది. దీంతో అతను కూడా తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అందరికీ తెలిసినట్లే ఈ కోచ్, కెప్టెన్ ద్వయం మధ్య చాలా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
వన్డే, టెస్టు జట్ల సారధ్య బాధ్యతలను కూడా కోహ్లీ వదిలేయొచ్చనే విధంగా రవిశాస్త్రి మాట్లాడాడు. కోహ్లీ హయాంలో గడిచిన ఐదేళ్లలో నెంబర్ వన్ టెస్టు జట్టుగా టీమిండియా నిలిచిందని, కాబట్టి తన వల్ల కాదు అనుకుంటే తప్ప ఈ బాధ్యతను కోహ్లీ వదులుకోవడం జరగదని ఈ మాజీ హెడ్‌కోచ్ చెప్పాడు. అయితే బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలనే ఆలోచనతో అతను ఆ సారధ్యాన్ని వదిలేసే అవకాశం కూడా ఉందన్నాడు.
‘అలాగే టెస్టు సారధ్యంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నట్లు కోహ్లీ చెప్పొచ్చు. ఆ నిర్ణయం అతనిదే. అతనొక్కడే కాదు. గతంలో కూడా చాలామంది కెప్టెన్లు బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడం కోసం జట్టు పగ్గాలు వదులుకున్నారు’ అని అన్నాడు. అంటే టెస్టు కెప్టెన్సీపై ఫోకస్ పెట్టేందుకు వన్డే సారధ్యానికి, పూర్తిగా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు అసలు పూర్తిగా సారధ్య బాధ్యతలనే కోహ్లీ దూరం పెట్టొచ్చనే విధంగా రవిశాస్త్రి మాట్లాడాడు.
టీ20 కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై చెప్పడంతో.. వన్డే జట్టు సారధ్య బాధ్యతను కూడా అతను త్వరలోనే వదిలేసుకుంటాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు రవిశాస్త్రి కామెంట్స్‌తో ఆ వార్తల్లో ఎంతోకొంత నిజముందని అనిపిస్తోంది. మీరేమనుకుంటున్నారు? వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ తప్పుకుంటాడంటారా?