

Gambhir slams Warner | ఏ బ్యాట్స్‌మెన్ అయినా సరే తమ జట్టును గెలిపించుకోవడం కోసం భారీ షాట్లు ఆడటం క్రికెట్‌లో సహజమే కదా. అలా ఆడితేనే బ్యాట్స్‌మెన్‌కు విలువ. కానీ ఒక సిక్స్ కొట్టినందుకు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తిట్టిపోస్తున్నాడు. అదో సిగ్గుమాలిన పని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాడు.
ఇంతకీ అసలు కథేంటంటే.. టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలుసు కదా. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఛేజింగ్ చేస్తుండగా 8వ ఓవర్ వేసేందుకు పాక్ సీనియర్ ఆటగాడు మొహమ్మద్ వచ్చాడు. అయితే మంచు ప్రభావమో ఏమో బౌలింగ్ వేసే సమయంలో బంతి అతని చెయ్యిజారింది. పిచ్‌పై రెండుసార్లు బౌన్స్ అయింది.
అదే బంతికి భారీ షాట్ కొట్టాలని అప్పటికే క్రీజును వదిలి ముందుకొచ్చిన వార్నర్.. వెంటనే మరో అడుగు ముందుకేసి ఆ బంతిని గట్టిగా బాదాడు. అది వెళ్లి బౌండరీ ఆవల పడింది. ఇది చూసి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, బౌలింగ్ చేసిన హఫీజ్ కూడా ఆశ్చర్యపోయారు. అంపైర్ దీన్ని నోబాల్‌గా ప్రకటించాడు కానీ, వార్నర్‌కు ఆరు పరుగులు వచ్చాయి. దీన్నే గంభీర్ తప్పుపట్టాడు.
బౌలర్ చేయి జారిన బంతిని ఇలా సిక్సర్‌గా కొట్టడం చాలా చవకబారు క్రీడాస్ఫూర్తి అంటూ ట్వీట్ చేశాడు. ఆ సిక్స్‌కు సంబంధించిన ఫొటోలతో ఈ ట్వీట్ చేస్తూ.. ఇలాంటి గొడవల్లో ఎక్కువగా ఇరుక్కునే టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయం అడిగాడు. మరి మీరేమంటారు? వార్నర్ చేసింది కరెక్టేనా? లేక గంభీర్ వాదన సరైందా?