

Shocking | విదేశాల్లో తమ దేశ రాయబార కార్యాలయాల్లో పనిచేసే అధికారులకు డిప్లొమాటిక్ పాస్‌పోర్టులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. సాధారణ పాస్‌పోర్టుతో పోల్చుకుంటే ఈ పాస్‌పోర్టు ఉన్న వారికి కొన్ని అదనపు హక్కులు ఉంటాయి. అలాంటి పాస్‌పోర్టు కాపీలు తీసి ఇతరులకు అమ్ముతూ పట్టుబడ్డాడో అమెరికా అధికారి.
లెబనాన్ ఎంబసీలో ఉద్యోగిలా తనను తాను పరిచయం చేసుకున్న సదరు అమెరికన్.. టర్కీ నుంచి ఇతరులను తన పాస్‌పోర్టుపై విదేశాలకు పంపుతూ దొరికిపోయాడు. తాజాగా ఒక సిరియా దేశస్థుడిని తన పాస్‌పోర్టుపై జర్మనీ పంపేందుకు అతను ప్రయత్నించాడు. అయితే ఆ పాస్‌పోర్టు చూసిన ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు అధికారులకు ఏదో అనుమానం వచ్చింది. దీంతో కొంత దర్యాప్తు చేశారు.
సీసీఫుటేజి పరిశీలిస్తే.. సదరు సిరియన్‌కు తన దుస్తులు, పాస్‌పోర్టు కాపీ ఇచ్చి ఒక కవర్‌లో డబ్బు తీసుకుంటున్న అమెరికన్ కనిపించాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న ఎయిర్‌పోర్టు అధికారులు.. ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. లెబనాన్ ఎంబసీ అధికారికి ఆ దేశంలో హక్కులుంటాయని, కానీ తమ దేశంలో నేరాలకు పాల్పడితే అతన్ని అరెస్టు చేసే హక్కు తమకు ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే సదరు వ్యక్తి అమెరికా దౌత్యవేత్త కాదని, కేవలం తమ దేశానికి చెందిన పౌరుడేనని అమెరికా తెలిపింది. ఏదిఏమైనా డిప్లొమాట్ పాస్‌పోర్టును కాపీ చేసి అమ్ముతూ పట్టుబడిన అమెరికన్ మాత్రం ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతున్నాడు.