

ఇంట్లోనే తుపాకులు తయారు చేయాలని అనుకున్నాడో 13 సంవత్సరాలు కుర్రాడు. అనుకున్నట్లే తనకు కావలసిన వస్తువులన్నింటినీ ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాడు. వాటన్నింటితో కష్టపడి తుపాకులు తయారు చేసి అమ్మకానికి పెట్టాడు. వాటిని చూడటానికి వచ్చిన కొందరు.. ఆ పిల్లాడిని ఆటపట్టించారు. తమకు నచ్చిన తుపాకులు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నారు.
వారిని బెదిరించడం కోసం తుపాకీతో కాల్చాడా కుర్రాడు. అయితే పొరపాటున ఆ తూటా ఆ కుర్రాడి అక్క కైరా నెవియా స్కాట్ (14)కు తగిలింది. సదరు బాలికకు తుపాకీ తూటా తగిలినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.. ఆమెను తీసుకొని ఆస్పత్రికి బయలుదేరారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
మృతురాలి సోదరుడు విల్సన్ బ్రాండన్ స్కాట్ (13) తుపాకులు అమ్ముతుండగా జరిగిన ఘటనలోనే ఆమె మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ కుటుంబం అమెరికాలోని జార్జియాలో నివసిస్తోందని సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.