

సింగపూర్: ఒక భారతీయ సంతతి వ్యక్తికి మరణశిక్ష విధించిందా కోర్టు. అయితే అతనికి ప్రాణభిక్ష పెట్టాలని ప్రపంచం నలుమూలల నుంచి ఆ ప్రభుత్వానికి అభ్యర్థనలు అందాయి. అతని కుటుంబం కోసమైనా మరణశిక్ష రద్దు చేయాలని చాలామంది విన్నవించారు. కానీ ఆ అభ్యర్థనలను కోర్టు తోసిపుచ్చింది.
అతను తప్పు చేస్తున్నట్లు తెలిసి కూడా చేశాడని తేల్చిచెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగేంత్రన్ కె. ధర్మలింగం అనే వ్యక్తి భారత సంతతికి చెందిన మలేషియన్. అక్రమంగా డ్రగ్స్ తరలిస్తూ 2009లో సింగపూర్ పోలీసులకు దొరికిపోయాడు. 42.72 గ్రాముల హెరాయిన్ దిగుమతి చేసినట్లు పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ కేసులోనే అతన్ని అరెస్టు చేశారు.
అప్పుడు ధర్మలింగం వయసు 21. ఈ కేసుపై విచారణ జరిపిన సింగపూర్ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. ఈ బుధవారం అతనికి మరణశిక్ష అమలు చేయబోతున్నారు. ఈ క్రమంలోనే అతనికి క్షమాభిక్ష పెట్టాలని సింగపూర్ ప్రభుత్వానికి విన్నపాలు వరుసకట్టాయి. వీటిపై స్పందించిన ద్వీపదేశ ప్రభుత్వం.. ‘అతను ఏం చేస్తున్నాడో తెలిసే చేశాడు’ అని స్పష్టం చేసింది.