
Record triple century

Record triple century | న్యూజిల్యాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఆటగాళ్లంతా కలిసి చేసిన స్కోర్ 379 పరుగులు. ఇందులో శ్రేయస్ అయ్యర్ సెంచరీ, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా చెరో అర్థ సెంచరీ చేయడం వల్లనే టీమిండియా ఈ స్కోరైనా చేయగలిగింది. అయితే 125 బంతుల్లో 331 పరుగులు. అందులో 30 సిక్సర్లు.. 28 ఫోర్లు ఉన్నాయి. ఈ స్కోరంతా ఏ జట్టు చేసిందబ్బా..? అని ఆలోచిస్తున్నారా..? అయితే మీ ఆలోచన తప్పు. ఇదంతా ఒక్కడంటే ఒక్క బ్యాట్స్‌మన్ చేసిన స్కోర్. జెర్సీ సినిమాలో నాని ఎలా అయితే ప్రతి బంతినీ కొడితో ఫోర్, బాదితే సిక్స్.. అన్నట్లు ఆడతాడో.. అచ్చం అదే తరహాలో అండర్-14 కుర్రాడు బాదాడు. అతడి పేరు మోహక్ కుమార్. వయసు 13 సంవత్సరాలు.
ప్రస్తుతం అండర్-14 డ్రీమ్ ఛేజర్ కప్ జరుగుతోంది. టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో మోహక్ ట్రిపుల్ సెంచరీ బాదాడు. అది కూడా అలా ఇలా కాదు.. కేవలం 125 బంతుల్లోనే. అవతలి వైపు బౌలింగ్ వేస్తోంది ఎవరు అనేది పట్టించుకోకుండా.. ఒక్కొక్కరికీ పట్టపగలే చుక్కలు చూపించాడు.

మెహక్ ఇన్నింగ్స్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన మోహక్.. తన స్కోర్‌లో 180 పరుగులు సిక్సర్లతోనే రాబట్టాడు. మరో 112 పరుగులు ఫోర్లతో రాబట్టాడు. మొత్తంగా 125 బంతుల్లోనే 331 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇక ఈ ఇన్నింగ్స్‌పై నెటిజన్లు కూడా విపరీతంగా స్పందిస్తున్నారు. మెహక్‌లో ఫ్యూచర్ టీమిండియా ఆటగాడు కనిపిస్తున్నాడని, అతడు ఇంకా ఎన్నో రికార్డులు సాధించాలని కోరుతున్నారు.