

కొంతకాలం క్రితం ప్రపంచ వ్యాప్తంగా పబ్‌జీ గేమ్ సృష్టించిన దుమారం అంతా ఇంతా కాదు. అయితే మధ్యలో ఈ గేమ్‌పై దేశంలో బ్యాన్ విధించడంతో దీని హవా తగ్గింది. ఆ తర్వాత ఈ గేమ్ మళ్లీ మార్కెట్‌లోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ యువత ఈ గేమ్‌లో పడి ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. మధుర ప్రాంతానికి చెందిన ఇద్దరు కుర్రాళ్లు పబ్‌జీ గేమ్‌లో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. మధుర-కాస్‌గంజ్ రైల్వే ట్రాక్ వద్ద ఈ ఇద్దరు కుర్రాళ్లు పబ్‌జీ ఆడుతున్నారు. ఈ గేమ్‌లో పడి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు.

గేమ్ ఆడుతూ వెళ్తున్న ఈ ఇద్దరూ రైల్వే ట్రాక్ ఎక్కి, పట్టాలపై వస్తున్న గూడ్స్ రైలును గమనించలేదు. ఈ క్రమంలో రైలు కింద పడిన ఇద్దరు కుర్రాళ్లూ మరణించారు. వీళ్లిద్దరి వయసూ 14 సంవత్సరాలనేనని పోలీసులు చెప్పారు. ఘటనా స్థలంలో దొరికిన రెండు మొబైల్స్‌లో ఒకటి పగిలిపోయిందని, కానీ రెండో దానిలో పబ్‌జీ గేమ్ రన్ అవుతోందని వెల్లడించిన పోలీసులు.. గేమ్ ఆడుతూ నడుస్తున్న వీళ్లు రైలు కింద పడ్డారని వివరించారు.