IndPak Reunion | దేశ విభజనప్పుడు విడిపోయారు.. 74 ఏళ్ల తర్వాత కలిశారు

IndPak Reunion:

IndPak Reunion: కొన్ని కథలు వినగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి కథలు సినిమాల్లోనే ఉంటాయే.. నిజజీవితంలో కూడా జరుగుతాయా..? అని ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఓ కథే.. సర్దార్ గోపాల్ సింగ్, మహమ్మద్ బషీర్‌లది. సర్దార్ గోపాల్ సింగ్ వయసు 94 ఏళ్లు. బషీర్ వయసు 91 సంవత్సరాలు. 7 దశాబ్దాల క్రితం వీరిద్దరూ విడిపోయారు.
1947లో స్వాతంత్ర్యం సమయంలో రెండుగా చీలింది భారత్. భరతదేశం, పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా ఏర్పడింది. ఈ విభజన కారణంగా ఈ స్నేహితులిద్దరూ విడిపోయారు. గోపాల్ సింగ్ భారత్‌లో ఉండిపోగా, బషీర్ పాకిస్తాన్ వెళ్లిపోయాడు.
అయితే అలా విడిపోయిన ఇద్దరూ 74 ఏళ్ల తరువాత ఇన్నేళ్లకు కర్తార్‌పూర్ వద్ద కలుసుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. గుండెలకు హత్తుకుని ఒకరినొకరు శుబాకాంక్షలు చెప్పారు. కాసేపు ముచ్చటించుకున్నారు.
ఇద్దరూ యుక్తవయసులో ఉన్నప్పుడు కర్తార్‌పూర్‌లోని గురుద్వారాకు తరచుగా వస్తుండేవారు. అక్కడ భోజనం చేసి టీ తాగేవారు. అయితే విభజన తర్వాత వీరిద్దరూ కలిసిందే లేదు. ఇన్నేళ్లకు అనుకోకుండా కలవడంతో వారిద్దరి హృదయాలూ బరువెక్కాయి.
దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేకమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మతం, ప్రాంతం, వైరాలు లేవని, కేవలం రెండు మనసులు మాత్రమే ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.