
MS Dhoni

MS Dhoni | టీమిండియా క్రికెట్లో ఎంఎస్ ధోనీ ఎలాంటి ఆటగాడో వేరే చెప్పక్కర్లేదు. ప్రత్యర్థి ఎవరైనా తన కూల్‌నెస్‌తోనే దెబ్బకొట్టే కెప్టెన్ అతడు.
వికెట్ల వెనుక చిరుతలా కదులుతూ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయడమే కాకుండా.. బౌలర్లకు ప్రత్యర్థి మైండ్‌ను సైతం వివరించి చెప్పగల దిట్ట.
ఇక బ్యాట్ పట్టాడంటే బౌండరీల మోత మోగాల్సిందే. ఎంతటి బెస్ట్ బౌలర్ బౌలింగ్‌లో అయినా క్రీజులో పాతుకుపోయి సిక్సర్ల వర్షం కురిపించగల ఆటగాడు.
మూడు ఫార్మాట్లలో జట్టును నెంబర్ వన్ చేసిన ఏకైక కెప్టెన్. అయితే ధోనీలో వచ్చిన ఈ మార్పునకు కారణం ప్రస్తుత టీమిండియా కోచ్, రాహుల్ ద్రవిడేనని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సెహ్వాగ్ ఎంఎస్ ధోనీ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.
టీమిండియాలోకి 2005లో ధోనీ అడుగుపెట్టాడని, అతి తక్కువ కాలంలోనే జట్టు కెప్టెన్ స్థాయికి ఎదిగాడని ప్రశంసించాడు.
అరంగేట్రంలో అతడి ఆటకు, కెప్టెన్ అయ్యేటప్పటికి అతడి ఆటకు చాలా తేడా ఉందని,
దానికి కారణం అప్పటి జట్టు కెప్టెన్ రాహుల్ ద్రవిడేనని సెహ్వాగ్ చెప్పాడు.
‘2006-07 సమయంలో ఓ మ్యాచ్‌లో ధోనీ చెత్త షాట్ ఆడి అవుటయ్యాడు. ఆ రోజు కెప్టెన్ ద్రవిడ్ ధోనీని తిట్టేశాడు.
ఇంత నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం ఏంటని నిలదీశాడు. ఆ మ్యాచ్ తర్వాత ధోనీలో ఎంతో మార్పు వచ్చింది.
కొన్ని నెలల్లోనే తనను తాను ఎంతగానో మార్చుకున్నాడు. బాధ్యతగా ఆడుతూ జట్టుకోసం భారీ స్కోర్లు చేయడం మొదలుపెట్టాడు.

దీంతో కొద్ది నెలల్లోనే అతడి ప్రతిభను గుర్తించిన బీసీసీఐ.. 2007 టీ20 ప్రపంచకప్ కెప్టెన్సీ బాధ్యతలను ధోనీకి అప్పగించింది. అలా ధోనీ మేటి నాయకుడిగా ఎదిగాడు’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ఇక ధోనీ ఎదుగుదలకు అంతకుముందు కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కారణమేనని సెహ్వాగ్ అన్నాడు. ధోనీ కోసం గంగూలీ తన స్థానాన్ని త్యాగం చేశాడని, అందువల్లే ధోనీ ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకుని అద్భుతంగా రాణించగలిగాడని అన్నాడు.
‘గంగూలీ అంతకుముందు నా కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. ఆ తర్వాత ధోనీ కోసం తన మూడో స్థానాన్ని కూడా త్యాగం చేశాడు. అలాంటి కెప్టెన్ దొరకడం కూడా అదృష్టమే’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.