

UPI | గత నాలుగైదేళ్లలో డిజిటల్ పేమెంట్స్ విభాగంలో భారత్ శరవేగంగా దూసుకెళుతోంది. దీనికి కారణం యూపీఐ పేమెంట్స్ విధానమే అని చెప్పాలి. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్. ఎప్పుడైనా, ఎక్కడైనా మన చేతిలో ఉండే మొబైల్ ద్వారానే ఒకరి బ్యాంకు ఖాతా నుండి మరొకరికి నగదు పంపించే అవకాశం ఈ యూపీఐ కల్పించింది. నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అభివృద్ధి చేసిన BHIM యాప్‌తో పాటు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్ పే వంటి ప్రయివేటు యాప్స్ కూడా యూపీఐ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా యాప్స్ తీసుకొచ్చాయి.
అయితే ఈ యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయాలంటే ముందుగా మన మొబైల్‌లో ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మొబైల్‌లో ఇంటర్నెట్ ఉండాలి. మీ మొబైల్ నెంబర్ బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ట్రాన్సాక్షన్స్ చేయలేదు. కానీ ఇప్పుడు అంత కష్టపడాల్సిన పనిలేదు. అంతకుమించిన మరో సరికొత్త విధానం అములులోకి వచ్చింది. ఈ విధానంతో ఎలాంటి యాప్ అవసరం లేదు. అంతేకాదు.. కనీసం ఇంటర్నెట్ సౌకర్యం కూడా అవసరం లేదు. మీ ఫీచర్ ఫోన్ నుంచి కూడా ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు.

దీనికోసం *99#కి డయల్ చేయాలి. దీనిని యూఎస్ఎస్‌డీ 2.0గా పిలుస్తున్నారు. ఈ విధానం కూడా నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) తీసుకొచ్చింది. దీని ప్రకారం *99# ద్వారా ఖాతాలోని నగదును ఇతరుల బ్యాంకు ఖాతాలకు పంపించవచ్చు. స్వీకరించవచ్చు. అలాగే బ్యాలెన్స్ విచారణ, యూపీఐ పిన్‌ని సెట్ చేయడం లేదా మార్చడం వంటి సేవలు కూడా ఉపయోగించుకోవచ్చు.
*99# సేవను ప్రస్తుతం 41 ప్రముఖ బ్యాంకులు అందిస్తున్నాయి. ఏ జీఎస్ఎం సర్వీస్ ప్రొవైడర్ల సిమ్ కార్డ్ వాడుతున్నా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు 12 భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా యూపీఐలానే 24గంటలూ పనిచేస్తుంది. అయితే దీనికి మీ టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు చేసిన ట్రాన్సాక్షన్‌లో 0.5శాతం, గరిష్ఠంగా రూ.1.5 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
రిజిస్టర్ ఎలా చేసుకోవాలి..?
- బ్యాంకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి *99# కు డయల్ చేయాలి.
- బ్యాంకు ఖాతాను సెలక్ట్ చేయాలి.
- డెబిట్ కార్డు చివరి 6 అంకెలను ఎంటర్ చేయాలి.
- ఎక్స్‌పైరీ తేదీని ఎంటర్ చేసి.. యూపీఐ పిన్ నంబర్‌ను ఇవ్వాలి. ఆ క్షణం నుంచి మీరు ఈ సేవలు వినియోగించుకోవచ్చు.
ట్రాన్సాక్షన్ ఎలా..?
- ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నుండి *99# కి డయల్ చేయాలి.
- వచ్చిన ఆప్షన్లలో నగదు పంపించాలంటే Send Money ఎంచుకోవాలి. ఇందుకు 1పైన క్లిక్ చేసి, రిప్లైని ఎంచుకోవాలి.
- ఏ ఆప్షన ద్వారా డబ్బును పంపిచాలో ఎంచుకోవాలి. మొబైల్ నెంబర్ అయితే 1, యూపీఐ ఐడీ అయితే 3, సేవ్ చేసిన లబ్ధిదారుని కోసం 4, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ కోసం 5 ఆప్షన్స్ ఎంచుకోవాలి.
- ఆ తర్వాత ఎవరికి పంపించాలనుకుంటున్నారో వారి మొబైల్ నెంబర్/యూపీఐ ఐడీ/ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ని ఎంటర్ చేయాలి.
- వివరాలు చెక్ చేసుకుని ధృవీకరించాలి.
- ఆ తర్వాత పంపించాలనుకున్న మొత్తాన్ని ఎంటర్ చేయాలి.
- అప్పుడు ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. వాటిని ధృవీకరించాలి.
- చివరిగా యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. వెంటనే నగదు బదిలీ అయిపోతుంది.
- బ్యాంకు ఖాతాలో నగదు డెబిట్ అయిన వెంటనే మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.
- అయితే ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్‌ను మాత్రం ముందుగా జాగ్రత్త చేసుకోవాలి. అప్పుడే ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినా.. నగదు బదిలీలో ఏదైనా సమస్యలు తలెత్తినా వెంటనే కంప్లైంటే చేసే అవకాశం ఉంటుంది.