

Husband killed wife | భార్య కనిపించడం లేదని ఓ భర్త వేదన చెందాడు. అత్తమామలకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. భార్య కోసం ఊరంతా గాలించాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఎంత చేసినా ఆమె ఆచూకీ మాత్రం దొరకలేదు.
కానీ ఆ తర్వాత పోలీసులు అడిగిన ఒకే ఒక ప్రశ్న ఈ కేసు స్వరూపాన్నే మార్చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కోననూర్ ప్రాంతంలో నారప్ప, సుమ దంపతులు నివసిస్తున్నారు.
గత డిసెంబరు 25 నుంచి తన భార్య కనిపించడం లేదని నారప్ప చెప్పాడు. అత్తమామలకు సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అప్పుడే నారప్ప ఇంటి చుట్టుపక్కల వాళ్లను ఆరా తీయగా.. కొన్నిరోజుల క్రితం నారప్ప సిమెంటు కొన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన పోలీసులు నారప్పను పిలిచి సిమెంటు ఎందుకు కొన్నావని ప్రశ్నించారు.
తాను ఇంట్లో జొన్నలు నిల్వ చేశానని, ఆ ప్రాంతంలో ఎలుకలు బొరియలు చేశాయని నారప్ప వివరించాడు. వాటిని పూడ్చేందుకు సిమెంట్ కొన్నానని చెప్పాడు.
ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి బయటికొచ్చాడు. ఆ వెంటనే ఫోన్ స్విచాఫ్ చేసేశాడు. దీంతో పోలీసులకు అనుమానం పెరిగింది. సుమ తల్లిదండ్రులు కూడా అల్లుడిపై అనుమానం వ్యక్తం చేశారు.
దీనికితోడు సుమ చెప్పులు వాళ్ల ఇంటి ముందే కనిపించాయి. ఇన్ని అనుమానాలు ఉండటంతో బలవంతంగా సుమ దంపతులు నివసిస్తున్న ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారు.
అక్కడ పరిశీలించగా.. ఇంట్లోని మంచం కింద పూడ్చిపెట్టిన సుమ మృతదేహం బయటపడింది. భార్యను చంపి ఇంట్లోని మంచం కిందే పూడ్చిపెట్టిన నారప్ప.. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నారప్ప ఇప్పటికే పరారీలో ఉన్నాడు.
#Karnataka, #HusbandKillsWife, #Murder