
2021 Recal | గుడ్ బై 2021. అండ్ వెల్‌కమ్ టూ 2022. ఓ కొత్త ఏడాది. కొత్త ఫీలింగ్. అయితే రేపు మనం ఆనందంగా ఉండాలంటే.. నిన్న ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాగే 2022 హ్యాపీగా ఉండాలంటే 2021ని మర్చిపోకూడదు. కొంచెం బాధ, కొంచెం ఆనందం.. మిక్స్‌డ్ ఫీలింగ్‌తో ముగిసింది ఈ ఏడాది. ఇప్పటిదాకా ఓ లెక్క. ఇప్పుడు ఇంకో లెక్క.
జనవరి 13:

దేశ చరిత్రలో మొట్టమొదటి సారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే జాతీయ బడ్జెట్‌ని డిజిటల్ విధానంలో ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ పేపర్లు ప్రింట్ చేయాలంటే పార్లమెంట్ బేస్‌మెంట్‌లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌లో దాదాపు 100 మంది ఒకేచోట పనిచేయాలి. దానివల్ల కోవిడ్ వ్యాప్తి జరిగే అవకాశం ఉంది. అందుకే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ను పేపర్‌లెస్‌గా ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికమంత్రి సీతారామన్ చెప్పారు.
జనవరి 24:

మూఢనమ్మకాలతో ఇద్దరు కుమార్తెలని చంపేశారు తల్లిదండ్రులు. చిత్తూరులోని మదనపల్లెలో ఈ ఘటన జరిగింది. తండ్రి కాలేజీ ప్రిన్సిపల్, తల్లి ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నా.. మూఢనమ్మకాల మాయలో పడి కుమార్తెలని చంపేశారు. విచిత్రం ఏంటంటే చనిపోయిన అమ్మాయిలు కూడా చిన్న పిల్లలు కాదు. పెద్దమ్మాయి వయసు 27ఏళ్లు. భోపాల్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. చిన్నమ్మాయి బీబీఏ పూర్తి చేసింది. ఇంత చదువుకున్నా తల్లిదండ్రుల మూఢనమ్మకాలకు బలయ్యారు.
జనవరి 26:

జమ్మూ-కాశ్మీర్ విభజన చట్టం 2019 ప్రకారం అప్పటివరకు ఓ రాష్ట్ర హోదాలో జమ్మూ కాశ్మీర్ జనవరి 26న అధికారికంగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడింది. అందులో లద్దాఖ్ అసెంబ్లీ ఉండే కేంద్ర పాలిత ప్రాంతం, జమ్మూ కాశ్మీర్ కేంద్రం ఆధీనంలో ఉండే కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలా ఓ రాష్ట్రం విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం ఇదే తొలిసారి.

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు భారీ సంఖ్యలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తీవ్ర హింసాత్మకంగా మారింది. ఏకంగా ఎర్రకోటలోకి చొచ్చుకొచ్చిన రైతులు జాతీయ పతాకం ఎగురవేయాల్సిన చోట వేరే జెండా ఎంగురవేశారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఢిల్లీలో ఇంటర్నెట్ కూడా నిలిపేశారు.
ఫిబ్రవరి 24:
అహ్మదాబాద్‌లోని మొతేరాలో ఉన్న అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్చారు. ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియంలో మొత్తం 1,32వేల మంది కూర్చోవడానికి అవకాశం ఉంది.
ఏప్రిల్ 7:

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాన్ని భారత్ పూర్తి చేసింది. శ్రీనగర్ సమీపంలో ఉన్న ఈ బ్రిడ్జ్ ఏకంగా 359 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు ఎక్కువ. దీని పొడవు 1.3 కిలోమీటర్లు. మరో విశేషం ఏంటంటే ఇది అన్ని బ్రిడ్జ్‌లలా కాకుండా ఆర్క్ అంటే విల్లులా వంగి ఉంటుంది. ఇది జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించారు.
మే 4:

కంగన రనౌత్ ఖాతాను శాశ్వతంగా బ్యాన్ చేసింది ట్విటర్. బెంగాల్‌లో జరిగిన ఎన్నికల అనంతరం జరిగిన ఘటనలపై కంగన చేసిన ట్వీట్ల ఆధారంగా ఆమె ట్విటర్ రూల్స్‌ను అతిక్రమించారని చెబుతూ.. ఆమె ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది ట్విటర్.
మే 17:

తౌక్తే తుఫాన్ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించింది. దాదాపు 90 మంది ఈ తుఫాను కారణంగా మరణించారు. ఈ తుఫాను గోవా, కేరళ రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి.
మే 19:

భారతదేశంలో మొట్టమొదటి వ్యవసాయ ఎగుమతి కేంద్రం Mahratta Chamber of Commerce, Industry, and Agriculture (MCCIA)ని పూణేలో ప్రారంభించారు. రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొని నేరుగా విదేశాలకు ఎగుమతి చేయడమే దీని లక్ష్యం. దీనివల్ల మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుంది. రైతులకు మేలు జరుగుతుంది. దీనిని నాబార్డ్‌తో కలిసి ఏర్పాటు చేశారు.
జూన్ 9:

ఐక్యరాజ్యసమితి United Nations Economic and Social Council (ECOSOC) సభ్య దేశంగా భారత్ ఎంపికైంది. 2022 నుంచి 2025 వరకు ఈ విభాగంలో భారత్ సభ్యదేశంగా ఉంటుంది.
జూలై 14:

భారత్‌లో సూపర్ సక్సెస్ సాధించిన BHIM-UPI QR-based payments విధానాన్ని భూటాన్‌లోనూ ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రారంభించారు.
ఆగస్టు 6:

క్రీడల్లో ఉన్నతమైన అవార్డుల్లో ఒకటైన రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పేరు మార్పును ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించినా.. ప్రధాని మోదీ మాత్రం వెనక్కి తగ్గలేదు. పేరు మార్చాలని ఎంతోమంది తనను కోరారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తేల్చి చెప్పారు.
ఆగస్టు 30:

ఒలింపిక్స్ 2021 అథ్లెటిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా పేరును పూణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌కు పెట్టారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన సందర్భంగా ఈ పేరు పెట్టారు. నీరజ్ చోప్రా ఇక్కడే తన జావెలిన్ త్రో శిక్షణ తీసుకున్నారు.
సెప్టెంబర్ 6:

ప్లాస్టిక్ ఒప్పందం ప్రారంభించిన తొలి దేశంగా భారత్ నిలిచింది.
సెప్టెంబర్ 10:

జాతీయ రహదారిపై అత్యవసరంగా విమానాలను దించే సౌకర్యాన్ని భారతదేశంలో మొట్టమొదటి సారి కల్పించారు. రాజస్థాన్‌లోని బార్మర్ ప్రాంతంలో ఉన్న NH925A హైవేపై ఈ ఎయిర్ స్ట్రిప్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ కలిసి ప్రారంభించారు. భారత్‌మాల పరియోజన ప్రాజెక్ట్ కింద రూ.765 కోట్లతో దీనిని నిర్మించింది.
అక్టోబర్ 2:

ప్రపంచంలోనే అతి పెద్ద ఖాదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. లద్దాఖ్‌లోని లేహ్ ప్రాంతంలో ఈ జెండాను ప్రదర్శించారు. 152వ గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్‌తో సహకారంతో ముంబైకి చెందిన ఖాదీ కార్మికులు ఈ జెండాను రూపొందించారు. దీనిని లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్ ఆవిష్కరించారు. ఈ జెండా 225 అడుగుల వెడల్పు, 155 అడుగుల వెడల్పు ఉంటుంది. 1000 కిలోల బరువు ఉంది. ఈ జెండాకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే దీనిని పూర్తిగా చేతితో అల్లారు.
అక్టోబర్ 14:

ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్‌కు భారీ మెజారిటీతో భారత్ మళ్లీ ఎన్నికైంది. మొత్తం 193 ఓట్లలో 184 ఓట్లు భారత్‌కు మద్దతుగా లభించాయి. ఈ స్థాయిలో ఏ దేశానికీ మద్దతు లభించలేదు. 2022 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు మొత్తం మూడేళ్ల కాలానికి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో భారత్ సభ్యదేశంగా ఉండనుంది.
నవంబర్ 6:

2013లో ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వరదలు అల్లకల్లోలం చేయడంతో కేదార్‌నాథ్ ఆలయం బాగా దెబ్బతిన్నది. దీంతో ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే వరదల వల్ల దెబ్బ తిన్న ఆదిశంకరాచార్య సమాధిని కూడా పునర్మించి అక్కడ ఆదిశంకరాచార్యుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. నవంబర్ 5న కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక మౌలిక సదుపాయాలను పునఃప్రారంభించడంతో పాటు 6వ తేదీన ఆదిశంకరాచార్యుని విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అయితే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత విగ్రహం ముందు ధ్యాన ముద్రలో కూర్చున్న మోదీ కూలింగ్ గ్లాసులు పెట్టుకున్న ఫోటోపై సోషల్ మీడియాలో కొంత విమర్శలు కూడా వచ్చాయి.
నవంబర్ 18:

భారతదేశంతో తొలి ఫుడ్ మ్యూజియం ఏర్పాటైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దీనిని ప్రారంభించారు. తమిళనాడులోని తంజావూరులో ఈ ఫుడ్ మ్యూజియంని ఏర్పాటు చేశారు. 1.1 కోట్ల రూపాయలతో 1860 చదరపు అడుగుల స్థలంలో ఈ మ్యూజియం ఉంటుంది. దీనిని ఏర్పాటు చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బెంగళూరులోని విశ్వేశ్వర ఇండస్ట్రీయల్ అండ్ టెక్నాలజీస్ మ్యూజియం సహకరించాయి. భారతదేశ ఆహార పదార్థాల చరిత్ర, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ ఎలా అగ్రస్థానానికి చేరింది..? అనే విషయాలను తెలియజేసేలా ఈ మ్యూజియంలో ఆహార పదార్థాలను ప్రదర్శనకు ఉంచారు.
నవంబర్ 19:

దాదాపు ఓ సంవత్సర కాలం పాటు రైతుల నిరసనల తర్వాత మూడు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శిక్కులకు పవిత్రమైన రోజైన గురు నానక్ జయంతి సందర్భంగా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు.
డిసెంబర్ 14:

కాశీలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో 339 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌లో తొలి ఫేజ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 14న ప్రారంభించారు. ఇది మోదీ కలల ప్రాజెక్ట్. మొదట ఈ ప్రాజెక్టును 3వేల చదరపు అడుగుల్లో నిర్మించాలని అనుకున్నా.. ఆ తర్వాత దీనిని 5 లక్షల చదరపు అడుగులకు పెంచారు.
డిసెంబర్ 20:

అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఈ పరీక్ష నిర్వహించింది. అగ్ని కేటగిరీలో కొత్త జనరేషన్‌లో అప్‌గ్రేడ్ చేసిన అధునాతన మిస్సైల్. ఇది అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగిన బాలిస్టిక్ మిస్సైల్.
ఇవి ఈ ఏడాది జరిగిన అతి ముఖ్యమైన ఘటనలు. ఇలాంటి ఘటనలు మరిన్ని ఉన్నా.. వాటిలో అతి ముఖ్యమైనవి, గుర్తుంచుకోవాల్సినవి ఎంపిక చేసి ఇక్కడ పొందుపరిచాం. హ్యాపీ న్యూ ఇయర్.