NZvsInd | మూడుకు మూడూ మనవే.. ఇదీ ఇండియా దెబ్బంటే..

NZvsInd

NZvsInd: టీమిండియా సూపర్ షోతో మెరిసింది. టీ20 ప్రపంచకప్‌లో తనను ఓడించినందుకు న్యూజిల్యాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంది. స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో మొదటి టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. మొదటి రెండు టీ20ల్లో గెలుపుతో సిరీస్ పట్టేసిన టీమిండియా.. ఈ రోజు జరిగిన మూడో టీ20లో మరింతగా రెచ్చిపోయి ఆడింది.
ఏకంగా 73 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియాకు రోహిత్ శర్మ(56: 31 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్ కిషన్(29:21 బంతుల్లో, 6 ఫోర్లు) అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చారు. అయితే వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్(0), రిషబ్ పంత్(4) వెంటవెంటనే ఔట్ కావడంతో టీమిండియా ఒత్తిడిలో పడింది.
అయితే మిడిల్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్(25: 20 బంతుల్లో, 2 ఫోర్లు), వెంకటేష్ అయ్యర్(20: 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) వికెట్ పడకుండా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయితే వరుస ఓవర్లలో వీరిద్దరూ అవుట్ కావడంతో మళ్లీ జట్టు కష్టాల్లో పడింది. అయితే టెయింలెండర్లు హర్షల్ పటేల్(18: 11 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చాహర్(21: 8 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
ముఖ్యంగా చివరి ఓవర్లో దీపక్ చాహర్ ఏకంగా 20 పరుగులకు పైగా సాధించి కివీస్ బౌలర్ మిల్నేకు చుక్కలు చూపించారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు సాధించింది. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 3 వికెట్లు తీయగా మిగిలిన వారంతా తలో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ప్రారంభం నుంచే తడబడింది. ఓపెనర్ డేరిల్ మిచెల్(5) అవుట్ కావడం.. ఆ తర్వాత మార్క్ చాప్‌మన్(0), గ్లెన్ ఫిలిప్స్(0) కూడా ఖాతా కూడా తెరవకుండా పెవిలియన్ చేరడంతో కివీస్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్‌లో లోకీ ఫెర్గ్యూసన్(14) తప్ప మిగిలిన వారెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయకలేకపోయారు. దీంతో నిర్ణీత 17.2 ఓవర్లలోనే 111 పరుగులకు ఆల్‌అవుట్ అయింది. దీంతో టీమిండియా 73 పరుగుల తేడాతో అద్భుత విజయం దక్కించుకుంది.
టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు, హర్షల్ పటేల్ 2 వికెట్లు, వెంకటేష్ అయ్యర్, యుజ్వేందర్ చాహల్, దీపక్ చాహర్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.