IPL2022 | వీళ్లని ఎవరైనా కొంటారా..?

IPL2022

Ipl 2022 | ఐపీఎల్-2021తో ఆటగాళ్ల కాంట్రాక్టులు ముగియడంతో ఫ్రాంచైజీలన్నీ అవసరమైన ఆటగాళ్లను రిటైన్ చేసుకుని మిగతా వాళ్లను వేలంలోకి విడిచిపెట్టేసింది. అలా ఫ్రాంచైజీలు వదులుకున్న వారిలో హర్షల్ పటేల్, రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్ వంటి మేటి ఆటగాళ్లూ ఉన్నారు.
అలాగే కొంతమంది ఫాం లేమితో బాధపడుతూ.. కనీస పరుగులు కూడా చేయలేక.. నానా అవస్థలు పడుతున్న వాళ్లూ ఉన్నారు. వారిలో కొంతమంది సీనియర్ ఆటగాళ్లు సైతం ఉన్నారు.
అయితే ఆడలేక అవస్థలు పడుతున్న ఈ సీనియర్ ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేస్తారా..? లేక వాళ్లు ఇక ఐపీఎల్‌కు దూరం కావలసిందేనా..? అనే విషయం మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. అయితే అలా అమ్ముడుపోయే అవకాశం లేని ఓ నలుగురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దినేశ్ కార్తీక్:

గత సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు సగం టోర్నీ వరకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించినా.. పేలవ ప్రదర్శనతో అటు కెప్టెన్సీతో పాటు ఇటు జట్టులో స్థానం కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది.
ఇక ఇప్పుడు వేలంలోకి రావడంతో అతడిని కొనడానికి ఏదైనా ఫ్రాంచైజీ ఆసక్తి చూపుతుందా..? లేదా..? అనేది అనుమానంగా మారింది. ఒకవేళ ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని రిటైన్ చేసుకోకపోతే.. దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కి కూడా ఇక్కడితో ఫుల్ స్టాప్ పడినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.
హర్బజన్ సింగ్:

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించకపోయినా.. ఇక హర్బజన్ మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకోవడం అసాధ్యమనే చెప్పాలి.
అలాగే గత సీజన్ ముందు జరిగిన మినీ వేలంలో అతడిని కేకేఆర్ కొనుగోలు చేసినా.. మూడు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఫలితంగా అతడిని వేలానికి వదిలేసింది కేకేఆర్. ఈ క్రమంలో అతడిపై ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించే అవకాశాలు లేవనే చెబుతున్నారు క్రికెట్ పండితులు.
అంబటి రాయుడు:

టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు కథ కూడా ఈ ఐపీఎల్ సీజన్‌తో ముగిసేలా కనిపిస్తోంది. గత సీజన్‌లో అంబటి రాయుడు మొత్తం 13 ఇన్నింగ్స్‌లు ఆడి 257 పరుగులు చేశాడు. అంటే కనీస నిలకడతో రాణించలేకపోయాడు.
పేలవ ప్రదర్శనతో బాధపడుతుండడంతో అతడిని సీఎస్కే వదిలేసింది. ఇప్పుడు అతడు వేలంలోకి వచ్చే అవకాశం ఉంది.
కానీ రాయుడు మంచి ఆటగాడు, అనుభవంగల బ్యాట్స్‌మన్ అయినా ఫిట్‌నెస్‌తో ఇబ్బంది పడుతుండడం, వయసు మీదపడుతుండంతో అతడిపై ఫ్రాంచేజీలు ఆసక్తి కనబచ్చకపోవచ్చు.
సురేశ్ రైనా:

చెన్నై సూపర్ కింగ్స్ మొదలైనప్పటి నుంచి ఆ జట్టుకే ఆడుతున్నాడు సురేశ్ రైనా. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల లిస్ట్‌లో రైనా 5528 పరుగులతో 4వ స్థానంలో ఉన్నాడు.
అయినా గత సీజన్లో అంతగా రాణించకపోవడంతో సీఎస్కే యాజమాన్యం అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడు వేలంలోకి రాబోతున్నాడు. అయితే ఈ సినియర్ ఆటగాడిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించే అవకాశం లేదనే చెప్పాలి.
అయితే ధోనీకి ఈ ఐపీఎల్ సీజన్ చివరిది అయ్యే అవకాశం ఉండడంతో.. రైనాను జట్టులోకి తీసుకోవాలని సీఎస్కేను ధోనీ కోరే అవకాశం లేకపోలేదు.
అదే జరిగితే తక్కవ ధరకే రైనాను సీఎస్కే దక్కించుకోవచ్చు.
#SureshRaina #AmbatiRaidu #HarbajanSingh #DineshKartik