
తండ్రి అంత్యక్రియలకు వెళ్లడం కోసం అమెరికా నుంచి ఆమె బయలుదేరింది. అత్యవసర వీసా కోసం న్యూయార్క్‌లోని భారత ఎంబసీ చేరుకుంది. అయితే అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఎంబసీలో ఉన్న అధికారులు ఆమెకు వీసా మంజూరు చేయలేదు. అంతేకాదు, అసలు ఎంబసీలో నుంచి బయటకు పో.. అంటూ వెనక్కు పంపేశారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘సోమవారం మా తండ్రి మరణించారు. ఆ విషయం తెలిసి స్వదేశానికి రావడానికి ప్రయత్నించా. వీసా కోసం న్యూయార్క్ ఎంబసీకి వెళ్తే ఈ ఘటన జరిగింది. మాకు వీసా ఇవ్వకపోవడం అటుంచితే.. ఇక ఎప్పుడూ భారత్‌కు వెళ్లకుండా వీసా బ్లాక్‌లిస్టులో పెడతామని బెదిరించారు.
వీసా కోసం నేను, నా భర్త ప్రాధేయపడ్డాం’ అని టీనా అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో యువతి పోస్టు పెట్టింది. సదరు అధికారి పేరు విజయ్ శంకర్ ప్రసాద్ అని, వీసా ఇవ్వకుండా ఇలా చేశాడని వీడియో షేర్ చేసింది. ‘మీరు అమెరికాలో ఉండిపోయారు. ఇక మీరు భారతీయులు కాదు అని చెప్పారు. ఆ తర్వాత న్యూయార్క్ పోలీసులను పిలిపించి బయటకు పంపేశారు’ అని ఆమె వివరించింది.
అయితే కొందరు నిజమైన భారతీయుల సాయంతో స్వదేశానికి తిరిగొచ్చి, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు పేర్కొంది. ఎవరినీ ఇలా ఘోరంగా అవమానించకూడదని, అది కూడా తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వార్త విని బాధపడుతున్న వారితో ఇలా అసలు ప్రవర్తించకూడదని తెలిపింది.