Wife birthday | భార్య పుట్టినరోజు మర్చిపోయే భర్తలకు జైలే జాగ్రత్త.. ఎక్కడంటే..

Wife birthday

Wife birthday: మీకు పెళ్లయిందా..? పెళ్లయితే మీ భార్య పుట్టినరోజు ఎప్పుడో చెప్పండి. పర్లేదు కాస్త ఆలోచించైనా చెప్పండి. మర్చిపోయారా..? అయితే ఎట్టిపరిస్థితుల్లో సమోవా దేశానికి మాత్రం వెళ్లకండి. ఎందుకుంటే ఆ దేశంలో ఎవరైనా భార్య పుట్టిన రోజు మర్చిపోవడం నేరం. అలాంటి ఇలాంటి నేరం కాదు.. ఏకంగా జైలు శిక్ష విధించే స్థాయి నేరం.
కొన్ని కొన్ని దేశాల్లో వింతైన ఆచారాలుంటాయి. అలాంటి ఆచారాల్లో ఒకటే ఈ సమోవా ఆచారం కూడా. పసిఫిక్ సముద్రం దగ్గర్లోని పోలినెసియన్ ప్రాంతంలో ఉంటుంది ఈ సమోవా దీవి. నిజానికి ఈ ఐలాండ్ చాలా అందంగా ఉంటుంది. అందం ఉన్న చోట కొంత రిస్క్ కూడా ఉంటుంది కదా. ఆ దీవి ఎంత అందంగా ఉంటుందో అక్కడి చట్టాలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా భార్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే భర్తలకు ఇక్కడ చుక్కలు చూపిస్తారు. దానికోసం కొన్ని విచిత్రమైన ప్రత్యేక చట్టాలను కూడా రూపొందించారు. అలాంటి విచిత్రమైన చట్టాల్లో ఒకటి.. భార్య పుట్టిన రోజు మర్చిపోతే జైలులో పెట్టడం.
ఎవరైనా భర్త ఖర్మ కాలి భార్య పుట్టినరోజు మర్చిపోతే.. వెంటనే ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన గంటల్లో పోలీసులు అక్కడకు చేరుకుని పాపం ఆ భర్తను తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు. పాపం కదూ.
అయితే ఇక్కడ ఈ విషయంలో కొంత మినహాయింపు కూడా ఉంటుంది. తొలిసారి తన భార్య పుట్టినరోజు మర్చిపోయిన భర్తకు వార్నింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. రెండోసారి కూడా మరిచిపోతే మాత్రం కచ్చితంగా ఎత్తుకెళ్లి జైల్లో పడేస్తారు. ఒకవేళ ఈ చట్టం మన దేశంలో వస్తే.. ఎంతమంది భార్యలు పోలీస్ స్టేషన్‌లకు వెళతారో.. ఎందరు భర్తలు జైళ్లలో పడతారో.. వామ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది.