Virat Kohli | టెస్టు జట్టు నుంచి కూడా తీసేశారా?..ఫ్యాన్స్ ఆగ్రహం


Virat Kohli | వాండరర్స్ మైదానం కోహ్లీకి బాగా అచ్చొచ్చిన గ్రౌండ్. అదీగాక ఈ మ్యాచ్ గెలిస్తే తొలిసారి సఫారీ గడ్డపై సిరీస్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించే అవకాశం.
గతంలో ఇక్కడ అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడిన కోహ్లీ.. సడెన్‌గా సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యాడు.
టాస్ వేసేందుకు వచ్చిన కేఎల్ రాహుల్.. వెన్ను నొప్పితో కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు చెప్పాడు. దీంతో ట్విట్టరాటి రకరకాలుగా స్పందిస్తున్నారు.
వాండరర్స్ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.
గతంలో సఫారీ టూర్లలో కూడా ఈ గ్రౌండ్‌లో కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమవడం అభిమానులను నిరాశపరిచింది.
ప్రాక్టీస్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli):
కోహ్లీ ప్రాక్టీస్‌లో ఉన్న ఫొటోలను బీసీసీఐ కూడా కొన్ని గంటల ముందే సోషల్ మీడియాలో పంచుకుంది. అలాంటిది ఆ ఫొటోలు పంచుకున్న 17 గంటల్లో కోహ్లీ మ్యాచ్‌కు దూరమవడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాక, తాజాగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ కూడా కోహ్లీ కెప్టెన్సీ వివాదంలో కోహ్లీదే తప్పన్నట్లుగా మాట్టాడాడు.
ఇది జరిగిన గంటల వ్యవధిలోనే కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమవడం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కెప్టెన్సీ నుంచి తొలగించిన వాళ్లే టెస్టు జట్టు నుంచి కూడా కోహ్లీని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.
కొందరేమో 100వ టెస్టును బెంగళూరులో ఆడించేందుకే కోహ్లీ ఈ మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకొని ఉండొచ్చని అంటున్నారు.
ఏదిఏమైనా ఇప్పటి వరకూ తన టెస్టు క్రికెట్ కెరీర్‌లో కోహ్లీ రెండే రెండు సార్లు గాయం కారణంగా ఒక మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియతో 2017లో జరిగిన ఒక మ్యాచ్, మళ్లీ ఇప్పుడే గాయం పేరు చెప్పి కోహ్లీ విశ్రాంతి తీసుకోవడం.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న అభిమానులు అసలు కోహ్లీకి నిజంగా గాయమైందా? లేక అన్నీ అబద్ధాలేనా? అని కూడా అడుగుతున్నారు. కోహ్లీని బీసీసీఐ పొడిచిన వెన్నుపోట్ల వల్లే అతనికి వెన్నునొప్పి వచ్చిందని కొందరు ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు.
#Virat Kohli #India #South Africa